Begin typing your search above and press return to search.

తెలంగాణలో డేంజర్ బెల్ మోగినట్లే..మంచిర్యాల స్కూల్లో అన్ని కేసులా?

By:  Tupaki Desk   |   16 March 2021 4:50 AM GMT
తెలంగాణలో డేంజర్ బెల్ మోగినట్లే..మంచిర్యాల స్కూల్లో అన్ని కేసులా?
X
కరోనా పోయింది. ఇంకెక్కడ ఉందన్న మాటలు ఈ మధ్యన ఎక్కువైంది. తరచి చూస్తే.. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తే ఆ మాటలో ఏ మాత్రం వాస్తవం లేదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. దేశంలో ఇటీవల కాలంలో కేసుల నమోదు ఎక్కువ కావటమే కాదు.. ఇప్పుడు రోజుకు 26వేల కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఆయా రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి బాగానే ఉందని చెప్పాలి.

కానీ.. భౌతికదూరాన్ని పాటించటం పోయి.. ముఖానికి మాస్కు పెట్టుకునే అలవాటు తగ్గిపోవటం.. చేతులకు శానిటైజ్ చేసుకోవటంలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో పాటు.. కరోనాను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఈ మాటలకు తగ్గట్లే.. అక్కడక్కడా వెలుగు చూస్తున్న ఉదంతాలు షాకింగ్ గా మారుతున్నాయి.

ఇటీవల హైదరాబాద్ లోని ఒక ప్రముఖ మీడియా సంస్థలో వారం వ్యవధిలో 40 కేసులు లెక్క తేలగా.. వారి ఇంట్లో వారిని పరీక్షిస్తే.. మరిన్ని పాజిటివ్ లు బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని కార్పొరేట్ సంస్థల్లోనూ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మహానగరమే కాదు.. కొన్ని జిల్లాల్లోనూ అలాంటి పరిస్థితే ఉందన్న మాట బయటకొస్తున్న కొత్త కేసులు చెబుతున్నాయి.

తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. సోమవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో 11 మంది ఉపాధ్యాయులు.. ఇద్దరు వంట నిర్వాహకులు.. ఒక విద్యార్థికి పాజిటివ్ గా నమోదైనట్లుగా తేలింది. మూడు రోజుల క్రితం స్కూల్ కు వచ్చిన ఒక టీచరమ్మకు కరోనా పాజిటివ్ కావటంతో తాజాగా పరీక్షలు నిర్వహించారు.

దీంతో.. 14 పాజిటివ్ కేసులు తాజాగా వెలుగు చూడటంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి. అదే విధంగా కరీంనగర్ లోని రెండు స్కూళ్లలో నాలుగు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇదంతా చూస్తే.. అప్రమత్తత ఏమాత్రం మిస్ అయినా రానున్న రోజుల్లో తెలంగాణలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. సో.. బీకేర్ ఫుల్.