Begin typing your search above and press return to search.

తెలంగాణలో మళ్లీ కరోనా తీవ్రరూపం.. ఏఎస్​ఐ మృతి

By:  Tupaki Desk   |   18 March 2021 5:30 AM GMT
తెలంగాణలో మళ్లీ కరోనా తీవ్రరూపం.. ఏఎస్​ఐ మృతి
X
కరోనా మరోసారి తీవ్ర రూపం దాల్చుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా కేసులు తగ్గిపోయాయి. వ్యాక్సిన్​ కూడా వచ్చేసింది అని ప్రజలు నిశ్చింతగా ఉన్న వేళ.. పెరుగుతున్న కేసులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఓ ఏఎస్​ఐ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది.

కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్‌ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యాదగిరికి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆయనను హైదరాబాద్​ లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే బుధవారం యాదగిరి కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. యాదగిరి మహాశివరాత్రి నాడు వేములవాడలో బందోబస్తు నిర్వహించినట్టు సమాచారం. అప్పడే ఆయనకు కరోనా సోకిఉంటుందని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలో పాఠశాలలు ఓపెన్​ చేసిన విషయం తెలిసిందే. దీంతో కరోనా మళ్ళీ విజృంభిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో కలిసి మొత్తం 104 కేసులు నమోదయ్యాయి. బైంసాలోని ఓ గురుకుల పాఠశాలలో 10 మందికి కరోనా సోకింది. వారిలో 9 మంది విద్యార్థులు, ఓ సిబ్బంది ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో పాఠశాలలను మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు నిన్న విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్​ సంప్రదింపులు జరిపారు.

తెలంగాణలో కొత్తగా 247 కరోనా కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. మంగళవారం కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1659కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2101 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు సింగరేణి కార్మికులకు, వాళ్ల కుటుంబసభ్యులకు ఉచితంగా వ్యాక్సినేషన్​ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి సీఎండీ శ్రీధర్​ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.