Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో కరోనా విజృంభణ..ఆంక్షలు విధించిన జీహెచ్ ఎంసీ!

By:  Tupaki Desk   |   27 March 2021 4:58 AM GMT
హైదరాబాద్‌ లో కరోనా విజృంభణ..ఆంక్షలు విధించిన జీహెచ్ ఎంసీ!
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎం సీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. జీహెచ్‌ ఎంసీలోని ఇంజినీరింగ్ - టౌన్‌ ప్లానింగ్ - ఐటీ - అకౌంట్స్ - స్పోర్ట్స్‌ విభాగాల్లోని వారికి పదిమందికి పైగా కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో అధికారులు - సిబ్బంది - ప్రజానీకం శ్రేయస్సు దృష్ట్యా ఆంక్షలు ప్రవేశ పెడుతున్నట్లు జీహెచ్ ఎం సీ ప్రకటించింది. జీహెచ్ ఎం సీ కార్యాలయాల్లో అధికారులు - సిబ్బంది కచ్చితంగా కోవిడ్‌ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీచేసింది.

ఇక ,భౌతిక దూరం పాటించడం - మాస్క్‌ లను ధరించడం - తరుచూ హ్యాండ్‌ వాష్‌ చేసుకోవడం వంటి నియమాలు విధిగా పాటించాలని పేర్కొంది. జీహెచ్‌ ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు - బిల్డర్లు - కాంట్రాక్టర్లకు కూడా ఇదే తరహాలో ఆంక్షలుంటాయని జీహెచ్ ఎం సీ స్పష్టం చేసింది. ఫిర్యాదులు - విన్నపాలు ఉంటే మై జీహెచ్ ఎం సీ యాప్ ద్వారా చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశ ద్వారం వద్ద నున్న గ్రీవెన్స్‌ సెల్‌ లో దరఖాస్తులు అందజేయాలని - అధికారులు - సిబ్బందిని సాధ్యమైనంత మేర కలవకూడదని తెలిపారు. జీహెచ్ ఎంసీ లో జరిగే అధికారిక కార్యక్రమాల సమాచారాన్ని సీపీఆర్వో ద్వారా మీడియా తెలియజేస్తామని, అదనపు సమాచారం అవసరమైతే జర్నలిస్టులు మధ్యాహ్నం 3-5 గంటల మధ్య సీపీఆర్వోను కలవాలని తెలిపారు. అందరి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని జీహెచ్‌ఎంసీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.