Begin typing your search above and press return to search.

కేసీఆర్ జీ.. తెలంగాణలోనూ 1000 మార్కు దాటేసిన కేసులు

By:  Tupaki Desk   |   3 April 2021 6:33 AM GMT
కేసీఆర్ జీ.. తెలంగాణలోనూ 1000 మార్కు దాటేసిన కేసులు
X
చూస్తుండగానే కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తొలి దశలో రోజుకు ఐదువేలకు పైగా కేసులు నమోదు అయ్యే స్థాయి నుంచి.. రోజుకు రెండు.. మూడు వందలకే పరిమితమయ్యే పరిస్థితి చూశాం. రెండో దశ మొదలైందన్న మాటకు తగ్గట్లే.. కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా పెరిగింది. తెలంగాణ సైతం ఇందుకు మినహాయింపు కాదు. అయితే.. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉన్న పరిస్థితి. అయితే.. ప్రజల నిర్లక్ష్యం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విషయంలో వ్యవహరిస్తున్న అలక్ష్యం కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుంది.

కొద్దిరోజుల క్రితమే ఏపీలో రోజుకు వెయ్యి కేసులు నమోదయ్యే దశను చేరుకోగా..తాజాగా తెలంగాణలో వెయ్యి కేసుల మార్కును దాటేసింది. చాలా రోజుల తర్వాత 1078 కేసులు నమోదయ్యాయి. అయితే.. వాస్తవంగా మరిన్నికేసులు నమోదయ్యాయని.. ప్రభుత్వం కేసుల నమోదును తగ్గించి చూపుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ అంశాల్ని పక్కన పెడితే.. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం33 జిల్లాల్లో శుక్రవారం ఒక్కరోజులో 1078 కేసులు నమోదైనట్లుగా తేల్చారు. వీటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 283 కేసులు నమోదైనట్లుగా తేలింది.

హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాల్లోనూ కేసుల నమోదు భారీగానే ఉంది. హైదరాబాద్ తర్వాత అత్యధిక కేసులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 113 కేసులు నమోదైతే.. రంగారెడ్డిలో 104 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ కేసులుగా ములుగు జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలో 2,

భద్రాద్రి కొత్తగుడెంలో 6, జనగామలో 8, జోగులాంబ గద్వాలలో 8, మహబూబాబాద్ లో 6, నారాయణపేటలో 7కేసులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో డబుల్ డిజిట్ కు తగ్గని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మరింత కఠినంగా నిబంధనల్ని అమలు చేయటం.. ట్రేసింగ్.. టెస్టింగ్.. ట్రీట్ మెంట్ విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తే తప్పించి కేసుల నమోదు మరింత తగ్గదన్నది మర్చిపోకూడదు. లేదంటే.. తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదన్న విషయాన్ని మర్చిపోకూడదు.