Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో సిత్రం.. కరోనా పరీక్షా.. వ్యాక్సిన్ ఒకే దగ్గరా?

By:  Tupaki Desk   |   14 April 2021 4:40 AM GMT
హైదరాబాద్ లో సిత్రం.. కరోనా పరీక్షా.. వ్యాక్సిన్ ఒకే దగ్గరా?
X
ఏదో మారుమూల ప్రాంతం కాదు. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న సిత్రాలు చూస్తే.. నోట మాట రాదంతే. కరోనా మహమ్మారి ఎక్కడ పట్టి పీడుస్తుందన్న భయాందోళనలతో వణికిపోతూ.. పరీక్షల కోసం పరుగులు పెట్టే చోటనే.. కరోనా రాకుండా ఉండేందుకు వేసే టీకాను వేయటంలో ‘లెక్క’ ఏమిటో అధికారులకే తెలియాలి. సెకండ్ వేవ్ పుణ్యమా అని పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ చిన్న సందేహం వచ్చినా.. పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

దీంతో.. టెస్టింగ్ కేంద్రాల వద్ద పరీక్షల కోసం వచ్చే వారి రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరీక్షల కోసం వచ్చే వారిలో నెగిటివ్.. పాజిటివ్ ఇద్దరు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇలాంటి కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే.. పాజిటివ్ వచ్చిన వారి కారణంగా.. అప్పటివరకు నెగిటివ్ ఉన్న వారు.. ఏ మాత్రం తేడా వచ్చినా పాజిటివ్ లోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో.. కోవిడ్ టెస్టుల్ని నిర్వహించే చోట మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి చోట్ల.. కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్ని నిర్వహించటానికి మించిన బుద్ది తక్కువ పని మరొకటి ఉండదు. వ్యాక్సిన్ వేయటానికి వీలుగా ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉండి.. ఎలాంటి వైరస్ లక్షణాలు లేని వారికి వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు వ్యాక్సిన్ వేసే కేంద్రాలు.. కరోనా టెస్టులు చేసే సెంటర్లు ఒకే చోట ఉండటం శాస్త్రీయత అనిపించుకోదు. కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పే సీఎం కేసీఆర్ కు.. ఇలాంటి సిత్రాల గురించిన సమాచారం ఉందా? అన్నది ప్రశ్నగా చెప్పక తప్పదు. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. వ్యాక్సిన్ వేయించుకునే వారు ఎవరైనా.. ఇలాంటి కేంద్రాలకు వెళ్లకుంటేనే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఈ మొత్తం ఉదంతంలో మరో కొసమెరుపు కూడా ఉంది. రెహ్మత్ నగర్ లోని శ్రీరాం నగర్ కాలనీలోని యూహెచ్ సీలో అయితే.. కరోనా టెస్టులు.. వ్యాక్సిన్ మాత్రమే కాదు.. చంటి పిల్లలకు వేసే టీకాలు ఒకేచోట వేస్తున్న వైనం చూస్తే.. వామ్మో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అందుకే కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.