Begin typing your search above and press return to search.

కరోనాను ఆరోగ్యశ్రీలో కానీ.. కేసీఆర్ ను గాంధీలో కానీ చేర్చాలట

By:  Tupaki Desk   |   25 April 2021 4:30 AM GMT
కరోనాను ఆరోగ్యశ్రీలో కానీ.. కేసీఆర్ ను గాంధీలో కానీ చేర్చాలట
X
కరోనా కేసులు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతున్న వేళ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే గుండె ధైర్యం సగటు జీవికి లేకుండా పోయింది. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా.. కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ట్రీట్ చేస్తామంటూ పెడుతున్న మెలిక ఇబ్బందికరంగా మారింది. ఇంతా అక్కడకు తీసుకెళ్లిన తర్వాత ఆడ్మిట్ చేస్తారా? లేదా? అన్నది సందేహంగా మారింది.

ఇదిలా ఉంటే.. ప్రైవేటు పరిస్థితి మహా దారుణంగా ఉంది. కరోనా పాజిటివ్ గా తేలాక ఆసుపత్రిలో వైద్యం అంటే లక్షల లక్షలు ఖర్చు అవుతోంది. బీమా దన్ను ఉన్నప్పటికి చేతిలో నగదు పెడితేనే వైద్యం చేస్తామని నిర్మోహమాటంగా చెబుతున్నారు. రూల్ ప్రకారం అలా చేయకూడదన్న మాట నోటి నుంచి వస్తే.. ఆసుపత్రిలో ఖాళీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వేళ.. ఒక సామాన్యుడు వినూత్న రీతిలో చేసిన నిరసన ఇప్పుడు షాకింగ్ గా మారటమే కాదు.. వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఈ డిమాండ్ న్యాయ సమ్మతంగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఒక వ్యక్తి తెలంగాణ కోవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తున్న గాంధీ ఆసుపత్రి ముందు.. ఒక ప్లకార్డు పట్టుకొని నిరసన చేపట్టారు. అందులో కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని.. లేదంటే సీఎం కేసీఆర్ ను గాంధీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సామాన్యుడి నుంచి సంపన్నుడు వరకు.. ఎవరైనా సరే మస్ట్ గా గాంధీలో చేరాలి ఉంటుందని.. వైద్యం చేయించుకోవాల్సిందేనని గతంలో చెప్పిన కేసీఆర్ మాటల్ని గుర్తు చేసేలా తాజా నిరసన ఉంది.

దీనికి తోడు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే ధైర్యం లేక.. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే స్తోమత లేని వైనంతో పాటు.. గతంలో తాను అన్న మాటలకు భిన్నంగా ప్రస్తుతం పాజిటివ్ గా ఉన్న కేసీఆర్.. తన పరీక్ష కోసం యశోదా లాంటి సూపర్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించుకోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో చేసిన నిరసన ఇప్పుడు వైరల్ గా మారింది.