Begin typing your search above and press return to search.

కలకలం : జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజే 32 శవాల అంత్యక్రియలు

By:  Tupaki Desk   |   29 April 2021 4:31 AM GMT
కలకలం : జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కరోజే 32  శవాల అంత్యక్రియలు
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి రోజురోజుకి దారుణంగా పెరిగిపోతుంది. ఇలాగే మరికొన్ని రోజులు ఈ కరోనా వ్యాప్తి జరిగితే దేశంలోని ప్రతి రాష్ట్రం కూడా మరో మహారాష్ట్రలా మారిపోతుందేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. ఎర్రగడ్డ ఈఎస్ ఐ హిందూ శ్మశానవాటికలో రోజు పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి.

తాజాగా బుధవారం ఒక్కరోజే 32 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు జీహెచ్‌ ఎంసీ అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 32 కరోనా బారినపడిన మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌ లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందుతూ మరణించినవారే ఉన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ శ్మశానవాటికలో వాటికి దహన సంస్కారాలు చేసినట్లు జీహెచ్ ఎం సీ అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఒక్క ఎర్రగడ్డ శ్మశానం లెక్క మాత్రమే. అధికారికంగా ప్రకటించిన లెక్కలే ఇంత ఉంటే అనధికారికంగా ఎన్ని ఉంటాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్క హైదరాబాద్‌ లోనే ఇలా ఉంటే .. మిగిలిన రాష్ట్రంలో ఎంత సంఖ్యలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

క‌రోనా విష‌యంలో రాబోయే 3,4 వారాలు చాలా కీలకమ‌ని, జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు తెలంగాణ‌ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. కరోనా విషయంలో తెలంగాణ కాస్త మెరుగ్గా ఉందని.. మహారాష్ట్ర, కర్నాటకలాంటి రాష్ట్రాల కంటే మన రాష్ట్రం పరిస్థితి బాగుందని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్ రావు వెల్లడించారు.