Begin typing your search above and press return to search.

కరీంనగర్ లో కుదిరింది తెలంగాణ మొత్తంలో సాధ్యం కాదా కేసీఆర్?

By:  Tupaki Desk   |   14 May 2021 8:30 AM GMT
కరీంనగర్ లో కుదిరింది తెలంగాణ మొత్తంలో సాధ్యం కాదా కేసీఆర్?
X
మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వేటు వేసిన నేపథ్యంలో.. ఏ జిల్లాకు ఆ జిల్లా మంత్రి బాధ్యతలు తీసుకోవాలని.. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకోవాలన్న సూచన చేయటం తెలిసిందే. దీన్ని మిగిలిన మంత్రులు పెద్దగా పట్టించుకోకున్నా.. కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కట్టడికి రెండు టాస్కు ఫోర్సు కమిటీల్ని ఏర్పాటు చేశారు. వీటికి తాను అధ్యక్షత వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. 24 గంటల పాటు వాట్సాప్ లో అందుబాటులో ఉండేలా ఈ గ్రూపుల్ని సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రైవేటు ఆసుపత్రులు.. డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు వైద్యం చేయాలని నిర్ణయించారు.

కొవిడ్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న వేళ.. సిటీ స్కాన్ లు ఎక్కువగా తీయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిటీ స్కాన్ కోసం రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని రూ.2వేలకు అందించేలా నిర్ణయించారు. ఒకవేళ ఫిలిం కావాలంటే మాత్రం రూ.200 అదనంగా ఇస్తే సరిపోతుందని స్పష్టం చేవారు. మంత్రి గంగుల చేసిన సూచనను కరీంనగర్ జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్లు ఓకే చెప్పాలి.

అంటే.. సిటీ స్కాన్ ఒక్కొక్క దానిపై సగానికి సగం ధర తగ్గిపోయేలా చేసిన మంత్రి గంగుల ఆలోచన బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన మాట కేవలం కరీంనగర్ జిల్లాకు పరిమితం చేయకుండా.. మిగిలిన రాష్ట్ర మంతా అమలు చేస్తే ప్రజల మీద భారీ భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంగుల చొరవను అభినందించి.. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా సీఎం కేసీఆర్ స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.