Begin typing your search above and press return to search.

ప్రైవేటు ఆసుపత్రిలో బిల్లు బాదుడు.. రాముకు ట్వీట్ చేస్తే చర్యలకు ఛాన్సు

By:  Tupaki Desk   |   17 May 2021 5:20 AM GMT
ప్రైవేటు ఆసుపత్రిలో బిల్లు బాదుడు.. రాముకు ట్వీట్ చేస్తే చర్యలకు ఛాన్సు
X
తెలంగాణ రాష్ట్రంలో సిత్రమైన పరిస్థితి నెలకొంది. సంపన్న రాష్ట్రంలో ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లేరు. ఈటల మీద సీఎం కేసీఆర్ వేటు వేయటం.. ఆయన స్థానంలో మరెవరినీ ఎంపిక చేయకపోవటం.. ప్రస్తుతానికి మంత్రి కేటీఆర్ కు టాస్కు ఫోర్సు ఒకటి అప్పజెప్పటం తెలిసిందే. సెకండ్ వేవ్ పుణ్యమా అని భారీగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆసుపత్రుల్లో బెడ్లు లభించక విపరీతమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక.. ఆసుపత్రుల్లో చేరిన వారి జేబులు చిల్లుబడేలా భారీగా బాదేస్తున్నారు.

ఈ క్రమంలో ఇలాంటి బాదుడు బారిన పడిన వారు దిక్కు తోచని పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ ట్విటర్ అకౌంట్ కు ట్వీట్ చేస్తున్నారు. ఇలా తనకు కంప్లైంట్ చేస్తున్న ట్వీట్ల మీద మంత్రి కేటీఆర్ రియాక్టు అవుతున్నారు. తాజాగా మహబూబ్ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్ చికిత్సకు భారీగా ఫీజును వసూలు చేశారు. ఇదే విషయాన్ని రోగి బంధువు ఒకరు కేటీఆర్ ట్విటర్ కు ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన రాము.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో మాట్లాడారు. పరిస్థితి గురించి ఆరా తీయాలని కోరారు.

దీంతో.. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న మంత్రి శ్రీనివాసగౌడ్.. అక్కడ జరుగుతున్న వైద్యం.. వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధించి రోగుల బంధువులతో మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోని 20 శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ఈ బెడ్లను పేదలకు వైద్యం చేయటానికి వినియోగిస్తామని చెప్పారు. రోగుల నుంచి అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

ఇదంతా చూస్తే.. తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల కొవిడ్ దోపిడీ ఎక్కడా ఆగినట్లుగా కనిపించదు. ఎక్కడికక్కడ సాగే దోపిడీకి అంతో ఇంతో చెక్ పెట్టేందుకు తెలంగాణలో మంత్రి కేటీఆర్ మినహా మరెవరూ కనిపించని పరిస్థితి. న్యాయం అన్నది అడుక్కుంటూనే తప్పించి అందదన్నట్లుగా ఉండటం సరికాదు. ప్రైవేటు ఆసుపత్రుల కక్కుర్తికి చెక్ చెప్పాలంటే.. మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయాల్సిందే. లేకుంటే.. న్యాయం అందేది కష్టమంటే సరికాదేమో?