Begin typing your search above and press return to search.

తెలంగాణలో కరోనా కేసులు అంతలా తగ్గాయా? లాక్ డౌన్ ఉండనట్లేనా?

By:  Tupaki Desk   |   4 Jun 2021 8:31 AM GMT
తెలంగాణలో కరోనా కేసులు అంతలా తగ్గాయా? లాక్ డౌన్ ఉండనట్లేనా?
X
లాక్ డౌన్ ను పొడిగిస్తూ మొన్న ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. నాలుగు గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్ లో కరోనా పాజిటివ్ రేటు ఐదు శాతం కంటే తక్కువకు చేరుకున్నంతనే లాక్ డౌన్ ఎత్తేయొచ్చని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయం కాస్త పెంచి.. లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

మొన్నటివరకు వణికించిన కరోనా తెలంగాణలో తగ్గుముఖం పట్టిందన్న వార్తలు ఈ మధ్యన వస్తున్నాయి. పాజిటివ్ కేసుల నమోదు మాత్రమే కాదు.. వైరస్ నిర్దారణ పరీక్షలు కూడా తగ్గుముఖం పట్టినట్లుగా గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటివేళ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని.. కరోనా తీవ్రత తగ్గినట్లు చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో 2 శాతం పాజిటివిటీ రేటు మాత్రమే ఉందని వెల్లడించారు. లాక్ డౌన్ పెట్టటానికి ముందు తెలంగాణలో పాజిటివిటీ రేటు 6.7 శాతంగా ఉంటే.. ప్రస్తుతం అది 2.1 శాతానికి తగ్గినట్లు చెప్పారు. లాక్ డౌన్ ను ఎత్తి వేయాలంటే ఐదు శాతం కంటే తక్కువకు పాజిటివిటీ రేటు వస్తే సరిపోతుందని కేసీఆర్ చెప్పారు. ఈ లెక్కన చూసినప్పుడు తెలంగాణలో పాజిటివిటీ రేటు భారీగా తగ్గినట్లే.

కాకుంటే.. కాస్త ఇబ్బందికరమైన విషయం ఏమంటే.. హైదరాబాద్ మహానగరంలో కేసుల నమోదు తగ్గగా.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకపక్క లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో తొందరపాటు వద్దని.. క్రమపద్దతిలో ఉండాలని చెబుతున్న నేపథ్యంలో.. లాక్ డౌన్ ను కొనసాగిస్తూనే.. ఇప్పుడు అమలు చేస్తున్న సమయాన్ని మరింత పెంచే వీలుందని.. సాయంత్రం నాలుగైదు గంటల వరకు ఉంచుతారన్న మాట వినిపిస్తోంది.