Begin typing your search above and press return to search.

తెలుగురాష్ట్రాల్లో మహమ్మారి విజృంభణ

By:  Tupaki Desk   |   5 Jun 2020 8:00 AM GMT
తెలుగురాష్ట్రాల్లో మహమ్మారి విజృంభణ
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.తెలంగాణలో గురువారం ఏకంగా కొత్తగా 127 కేసులు నమోదు కావడం పరిస్థితి చేయిదాటేలా కనిపిస్తోంది. ఒక్క హైదరాబాద్ లోనే దీని తీవ్రత అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో కొత్తగా 127 కేసులు నమోదు కాగా.. అందులో హైదరాబాద్ పరిధిలోనే 110 కేసులు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక ఆదిలాబాద్ లో 7 కేసులు, రంగారెడ్డిలో 6, మేడ్చల్ లో 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒక్కోకేసు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3147కు చేరింది. గడిచిన 24 గంటల్లోనే వైరస్ బారిన పడి ఆరుగురు మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 105కు చేరింది.

*ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతూనే ఉన్న కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 98 కేసులు ఏపీలో నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4112కి చేరాయి.. వైరస్ తో నిన్న ముగ్గురు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 71కి చేరింది.

*భారత దేశంలో ఉధృతంగా వైరస్ విస్తరణ
భారతదేశంలో కరోనా కోరలుచాస్తోంది. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 9304 మందికి కరోనా పాజిటివ్ గా నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రికార్డు స్థాయిలో ఒక్కరోజు 10వేల కేసులు నమోదు కావడం సంచలనమైంది. మరణాలు రికార్డు సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ తో 260మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య దేశంలో 6వేలు దాటింది.

* దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,16,919 కి చేరింది. మరణాలు 6075కి చేరాయి. దాదాపు 1.04 లక్షల మంది కోలుకున్నారు.

*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గురువారం లక్షకి పైగా కేసులు నమోదవ్వగా మొత్తం కేసుల సంఖ్య 66,92,686కి చేరాయి. అలాగే నిన్న ఆరువేలమందికి పైగా మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,92,286కి చేరాయి.

అమెరికాలో మళ్లీ వైరస్ జోరందుకుంది. నిరసనలతో కొత్త కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గురువారం కొత్తగా 20578 కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 19,24,051కి చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 1,10,173కి చేరింది. అమెరికా తర్వాత బ్రెజిల్, రష్యా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, టర్కీ దేశాల్లో కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది.