Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని చూటేస్తున్న బ్రిటన్ కొత్త వైరస్ స్ట్రెయిన్ ... తెలుగు రాష్ట్రాల్లోను కలకలం , క్యారియర్స్

By:  Tupaki Desk   |   24 Dec 2020 8:32 AM GMT
ప్రపంచాన్ని చూటేస్తున్న బ్రిటన్ కొత్త వైరస్ స్ట్రెయిన్ ... తెలుగు రాష్ట్రాల్లోను కలకలం , క్యారియర్స్
X
కరోనా వైరస్ నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకుంటున్న సమయంలో బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడం తో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. బ్రిటన్ లో ఈ కొత్త వైరస్ విజృంభణ మొదలైంది అని తెలియగానే ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ, డెన్మార్క్, ఆస్ట్రియా, పోర్చుగల్, స్వీడన్‌ , భారత్ లు ఇప్పటికే బ్రిటన్‌ నుంచి తమ దేశాలకు విమానాలు రాకుండా తాత్కాలిక నిషేధం ప్రకటించాయి.

అయితే , ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కేసులు తమ దేశాల్లో బయటపడ్డాయని నార్తర్న్ ఐర్లాండ్, ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించాయి. లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఇది సోకినట్టు గుర్తించామని ఐర్లండ్ ప్రకటించింది. అలాగే, ఇంగ్లాండ్ నుంచి తమ దేశంలో ప్రవేశించిన నలుగురికి ఈ స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. కరోనా వైరస్ క్వారంటైన్ గా కేంద్రంగా మార్చిన ఓ హోటల్ కి ముగ్గురిని తరలించామని, మరో కేసు వివరాలు తెలియాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ కొత్త మహమ్మారి తలెత్తిన తరుణంలో మోడెర్నా సంస్థ విశిష్టమైన ప్రకటన చేసింది. నూతన వైరస్ స్ట్రెయిన్ నుంచి రక్షించి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేట్టు తమ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇవ్వగలదని ప్రకటించింది. పైగా ఇందుకు అనుగుణంగా మరిన్ని టెస్టులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అటు-ఫైజర్, ఆస్ట్రాజెనికా కంపెనీలు కూడా తమ టీకామందులు కొత్త వైరస్ ను నీరు గార్చవచ్చునని భావిస్తున్నాయి. ఇక బ్రిటిష్ హెల్త్ ఏజెన్సీ..తమ రాపిడ్ కోవిడ్ 19 టెస్టులు నూతన వైరస్ ను గుర్తించగలవని , ఇవి జయప్రదంగా కొనసాగుతున్నాయని తెలిపింది.

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్ వైరస్ తాజాగా కరీంనగర్ ‌లో కలకలం రేపుతోంది. గడిచిన కొన్ని రోజులుగా బ్రిటన్ నుంచి జిల్లాకు 16 మంది వచ్చారని సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పది మంది శాంపిల్స్ తీసుకున్న జిల్లా వైద్యాధికారులు నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌ కు తరలించారు. ఇదిలా ఉంటే మరో ఆరుగురి కోసం అధికారులు వేట ప్రారంభించారు.

అలాగే , యూకె నుండి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకింది. యూకే నుంచి ఢిల్లీ వచ్చిన ఆ మహిళకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రికి వచ్చింది. రాజమండ్రికి వచ్చిన మహిళను అధికారులు పట్టుకొని ఆసుపత్రికి తరలించారు. ఆమెతో పాటుగా ఆమె కొడుకును కూడా ఆసుపత్రికి తరలించారు. మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని తేల్చేందుకు రక్తనమూనాలను సేకరించారు. పూణే లోని వైరాలజి ల్యాబ్ కు పంపించి మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని తేల్చబోతున్నారు. మొత్తంగా బ్రిటన్ వైరస్ ప్రభావం దేశంలో ఎక్కువ ప్రభావం చూపకుండా త్వరగా ఈ కొత్త వైరస్ క్యారియర్స్ ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైయ్యారు.