Begin typing your search above and press return to search.

సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి కూడా అదే ప్రమాదకర వేరియంట్?

By:  Tupaki Desk   |   6 Jan 2022 5:32 AM GMT
సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి కూడా అదే ప్రమాదకర వేరియంట్?
X
దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కు ముందు పరిస్థితులు దాపురిస్తున్నాయి. మెల్లిగా దేశం థర్డ్ వేవ్ దిశగా సాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ ముందర కూడా దేశంలోని చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఇలానే కరోనా బారినపడ్డారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే ప్రముఖులను, వారి కుటుంబాలను కరోనా కల్లోలం చేస్తోంది. వరుసగా సెలబ్రెటీలు కరోనా బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా రూపాలు మార్చుకుంటూ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదటి వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్న భారతదేశం రెండో వేవ్ కు కుదేలైంది. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న ‘ఒమిక్రాన్’ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా దేశంలో మరో డేంజర్ వేరియంట్ భయపెడుతోంది. సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ కు అప్డేట్ వెర్షన్ గా డెల్టా ప్లస్ కేసులు దేశాన్ని భయపెడుతున్నాయి. కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో విస్తరిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి..

టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రెండు డోసుల కరోనా టీకా వేసుకున్నా కూడా ఆయనకు మళ్లీ కరోనా వైరస్ సోకడం ఆందోళనకు కారణమైంది. తాజాగా గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. నిర్వహించిన పరీక్షల్లో గంగూలీకి సోకింది డెల్టా ప్లస్ వేరియంట్ గా తేలింది.గత వారం కరోనా బారిన పడిన గంగూలీ కోల్ కతాలోని వుడ్ లాండ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించగా.. అందులో నెగెటివ్ వచ్చింది. దీంతో గంగూలీ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలోనే గంగూలీని డిశ్చార్జి చేసినట్లు సమాచారం. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో గంగూలీకి డెల్టా ప్లస్ పాజిటివ్ గా గుర్తించామని వైద్యులు తెలిపారు.

దేశంలో డెల్టా వేరియంట్ ఎంతటి వినాశనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అంతకుమించిన పెను విషాదాన్ని ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ సృష్టిస్తుందా? అన్న భయాలు వెంటాడుతున్నాయి. సెకండ్ వేవ్ వేళ కనీసం మృతదేహాలను ఖననం చేయడానికి టైం లేక వదిలేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట్లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అతడి మామ, వదిన, కజిన్ ఈ మహమ్మారి బారినపడ్డారు. సౌరవ్ గంగూలీ ఇంట్లో తాజాగా కరోనా కల్లోలం సృష్టించింది. నాలుగురోజులు కోల్ కతాలోని ఉడ్ ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న గంగూలీ.. అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. గంగూలీ 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉంటాడని ఉడ్ ల్యాండ్స్ ఆస్పత్రి గత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

తాజాగా గంగూలీ కూతురు సనాకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్ గా తేలిన రోజుల వ్యవధిలోనే అతడి మామ దేబశిష్ గంగూలీ, కజిన్ సౌరదీప్ గంగూలీ, వదిన జాస్మిన్ గంగూలీ కూడా కరోనా బారినపడ్డారు. ఇప్పుడు తాజాగా గంగూలీ కూతురు సనా కూడా ఈ మహమ్మారి బారినపడడంతో దాదా కుటుంబంలో మరిన్ని కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

20 ఏళ్ల సనా కోల్ కతాలో చదువుకొని అనంతరం ఉన్నత చదువుల కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లింది. ప్రస్తుతం కోల్ కతాలో తండ్రితోపాటు ఉంటోంది. 2021 జనవరిలోనే గంగూలీకి గుండెపోటు రాగా రెండు స్టంట్లు వేశారు. తాజాగా కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేర్చారు.

ఇక సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారినపడ్డారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే (65) కొవిడ్‌ బారినపడ్డారు. ఈయన గతంలోనూ వైర్‌స్ కు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కుటుంబంలో ఒకరికి, వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఐసొలేషన్‌లోకి వెళ్లారు.

ఇక సినీ ఇండస్ట్రీని కరోనా వదలడం లేదు. బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం (49) ఆయన భార్య ప్రియా రంచల్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. సినీ, టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌(46) వైర్‌స్ కు గురయ్యారు. బాలీవుడ్‌ ప్రసిద్ధ నటుడు ప్రేమ్‌ చోప్రా(86) ఆయన భార్య ఉమా చోప్రాలకు కరోనా సోకింది. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నిర్వహించే ప్రజాదర్బార్‌లో పాల్గొన్న 14 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్ర మాజీ సీఎం జీతన్‌ రామ్‌ మాంజీ (77), ఆయన ఇంట్లో 18 మందికి పాజిటివ్‌గా తేలింది. ఛత్తీస్ గఢ్‌ సుక్మా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 38 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వైరస్‌ బారినపడ్డారు.

బాలీవుడ్ సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. కరీనాకపూర్, నోరా ఫతేహి కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతోపాటు ఆయన సతీమణి ప్రియా రాంచల్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ హోం క్వారంటైన్ లో ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కు కరోనాసోకింది. తనకు సన్నిహితంగా ఉన్న వారు పరీక్షలు చేసుకోవాలని ఆమె కోరింది.