Begin typing your search above and press return to search.

ప‌ట్ట‌ప‌గ‌లే జూబ్లీహిల్స్‌ లో నివ్వెర‌పోయే దోపిడి

By:  Tupaki Desk   |   4 Jan 2018 5:26 PM GMT
ప‌ట్ట‌ప‌గ‌లే జూబ్లీహిల్స్‌ లో నివ్వెర‌పోయే దోపిడి
X
హైదరాబాదీలు షాక్ అయ్యే వార్త ఇది.జూబ్లీహిల్స్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నిత్యం రద్దీగా ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ 10లో పట్టపగలు నివ్వెరపోయే ఘటన జరిగింది. కత్తులు పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు వాహనదారులను టార్గెట్ చేశారు. రోడ్డు పక్కన నక్కి ఉండి.. బైక్ పై వెళుతున్న వ్యక్తిపై అకస్మాత్తుగా దాడి చేశారు. కత్తులతో బెదిరించారు. జేబులోని డబ్బుతో పాటు పర్స్ లాక్కున్నారు. దాడి చేసి బైక్ లాక్కున్నారు. అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటన మొత్తం ఈ పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న యాదగిరి మరో ఉద్యోగితో కలిసి... ఆఫీస్ పనిమీద జూబ్లీహిల్స్‌ వెళ్లాడు. ఒకరు షాపులోకి వెళ్లగా.... యాదగిరి బైక్ మీద బయట వేచి చూస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు యాదగిరిని కత్తులతో బెదిరించడమే కాకుండా బైక్‌ మీద నుంచి కిందకు తోసేశారు. ఆ తరువాత.. గొంతుపై కత్తిపెట్టి.. పర్సు లాక్కున్నారు. జనవరి 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. పట్టపగలు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేస్తుంటే.. మిగిలిన వాహనదారులు మొత్తం అలాగే చూస్తూ ఉండిపోయారు. వాహనాలపైనే ఉన్నారు. కిందకు కూడా దిగలేదు. పట్టనట్లే వ్యవహరించారు. వాళ్ల గొడవ అయిపోతే.. మనదారిన మనం వెళ్లిపోదాం అన్నట్లే చూస్తూ ఉండిపోయారు.

అయితే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 అంటే ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. వేలాది మంది తిరుగుతూ ఉంటారు. అలాంటి రోడ్డులో కత్తులు పట్టుకుని ముగ్గురు వ్యక్తులు పట్టపగలు తిరుగుతున్నారు అంటే.. ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాగా భావిస్తున్నారు. ఇంతకు బరితెగించారు అంటే.. వీళ్లు మామూలు దొంగలు కాదని.. దోపిడీలు, హత్యలు చేసే దారిదోపిడీ ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ విజువల్స్ పరిశీలించిన తర్వాత.. విచారణ వేగవంతం చేశారు. ప్రత్యేక టీమ్స్ రంగంలోకి దిగాయి. దోపిడీ ముఠా ఎత్తుకెళ్లిన బండి వివరాలు.. ఏయే ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి వెళ్లింది అనే విషయాలను బయటకు తీస్తున్నారు.