Begin typing your search above and press return to search.

డార్క్‌వెబ్‌ డాటా.. దిల్లీ నుంచి కెనడియన్లకు వల

By:  Tupaki Desk   |   19 Nov 2019 4:11 AM GMT
డార్క్‌వెబ్‌ డాటా.. దిల్లీ నుంచి కెనడియన్లకు వల
X
పోలీసులమని చెప్పి మోసగిస్తూ కెనడా జాతీయుల ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు చేశారు దిల్లీ పోలీసులు. దిల్లీలోని మోతీ నగర్‌లోని ఓ ఇల్లు కేంద్రంగా సాగుతున్న వ్యవహారానికి సంబంధించి సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు 32 మందిని అరెస్టు చేశారు. అయితే, నిర్వాహకులు మాత్రం తప్పించుకున్నారు.

ఈ ముఠా డార్క్ వెబ్ సహాయం తో కొందరు కెనడా జాతీయుల వ్యక్తిగత, ఆర్థిక డాటాను సంపాదించి దాన్ని అడ్డం పెట్టుకుని వారిని బెదిరిస్తోంది. వీరు ఈ కాల్ సెంటర్ నుంచి కెనడా జాతీయులకు ఫోన్ చేసినప్పుడు కూడా స్ఫూఫింగ్ ద్వారా ఇండియన్ నంబర్ కనిపించకుండా కెనడా పోలీసుల నంబర్ కనిపించేలా చేసి కాల్ చేస్తున్నారు.

డార్క్ వెబ్‌లో టీవోఆర్ బ్రౌజర్ల ద్వారా కెనడాలో పన్నులు ఎగ్గొట్టినవారు, నేర చరిత ఉండి తప్పించుకుంటున్నవారి వివరాలు సేకరించి వారిని లక్ష్యంగా చేసుకుని కాల్ చేస్తున్నారు. జైలు శిక్ష తప్పించుకోవాలంటే 20 వేల డాలర్లు ఇవ్వాలని బెదిరించి వసూలు చేస్తున్నారు.

ఈ ముఠా బారినపడిన కెనడా కు చెందిన ఎల్విస్ హెన్నీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులకు ఈ సంగతంతా తెలిసింది. బన్నీ అరోరా అలియాస్ దివ్యమ్ అరోరా, రాజా, సుశీల్, నవీన్, పంకజ్, జస్జోత్, సరబ్జిత్, సాగర్‌లు ఈ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు.