Begin typing your search above and press return to search.

నేవీ వల్లకాదంటే..మనోడు మాత్రం బోటును బయటకు తీశాడు

By:  Tupaki Desk   |   23 Oct 2019 8:09 AM GMT
నేవీ వల్లకాదంటే..మనోడు మాత్రం బోటును బయటకు తీశాడు
X
అతనేమీ ఐఐటీల్లో చదువుకోలేదు. ఆ మాటకు వస్తే చదువు కూడా లేదు. కానీ.. ఏళ్లకు తరబడి తాను చేసే పని మీద నైపుణ్యమే కాదు.. లాజికల్ గా ఆలోచించే తెలివి ఉంది. అదే ఇప్పుడు అతన్ని హీరోగా మార్చాయి. అత్యున్నత సాంకేతికత అండదండలు ఉన్న నేవీ సైతం నావల్ల కాదని తేల్చేసిన ఇష్యూను టేకప్ చేయటమే కాదు.. దాన్ని సక్సెస్ ఫుల్ చేసిన ధర్మాడి సత్యం ఇప్పుడు రియల్ హీరో అయ్యారు. గోదావరిలో మునిగిన వశిష్ఠ బోటును వెలికి తీసే విషయంలో నేవీ.. ఎన్డీఆర్‌ ఎఫ్‌ బృందాలు చేతులెత్తేశాయి. అందుకు భిన్నంగా తనకు అవకాశం ఇస్తే బోటును వెలికి తీస్తానని చెప్పటం సంచలనంగా మారింది.

చదువుకోకున్నా.. సముద్రంలో..నదిలో బోట్లు మునిగిపోతే వెలికి తీసే అనుభవం అతని సొంతం. ఆయనకు సొంతంగా మెరైన్ సంస్థ ఉంది. మొదటిసారి యానాంలో నీట మునిగిన లాంచీని బయటకు తీసిన తర్వాత అతనికి గుర్తింపు లభించింది. తర్వాత నాగార్జున సాగర్ లో మునిగిన బోటును ఇంజిన్ చైనుతో బయటకు తీశారు. తర్వాత మంటూరు వద్ద గోదావరిలోనూ మునిగిన బోటును బయటకు తీశారు.

రెండు తెలుగు రాష్ట్రాల వారికి తీవ్ర దిగ్భాంత్రి కలిగించిన కచ్చులూరు వద్ద పర్యాటక బోటు మునిగిపోయి.. భారీ విషాదం చోటు చేసుకున్న వేళ.. మునిగిన బోటును తాను వెలికి తీస్తానంటూ ముందుకు వచ్చాడు ధర్మాడి. అయితే.. నేవీతో పాటు ఉత్తరాఖండ్ కు చెందిన విపత్తు నిర్వాహణ బృందం కూడా బోటును బయటకు తీయలేక చేతులు ఎత్తేశారు.

వశిష్ఠ బోటును మరో టైటానిక్ గా పలువురు అభివర్ణించారు. వరద ఉద్ధృతికి ఇసుకలో కూరుకుందని.. అలాంటి వాటిని బయటకు తీయటం సాధ్యం కాదని తేల్చేశారు. అయితే.. ఈ ఆపరేషన్ ను సవాలుగా తీసుకొని కేవలం రూ.22.7లక్షల ఖర్చుతో బోటును బయటకు తీసేందుకు విపరీతంగా శ్రమించారు. పదిహేనురోజులుగా అలుపెరగని రీతిలో కష్టపడిన ఆయన.. చివరకుతాను అనుకున్నది సాధించాడు. విశాఖ నుంచి స్కూబా డ్రైవింగ్ నిపుణులను పిలిపించి తాను అనుకున్నది సాధించాడు.

వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోటు వెలికితీత కార్యక్రమానికి మధ్యలో బ్రేకులు పడినా.. చివరకు తాడు.. ఇతరత్రా సామాగ్రితో.. లాజిక్ తో మునిగినబోటునుబయటకు తీయగలిగారు. ఎంతోమంది బోటులో జలసమాధి అయ్యారని.. వారి బంధువులకు కడసారి చూపించాలన్న పట్టుదలతోనే తాము బోటును బయటకు తీసినట్లుగా చెప్పారు. ఏమైనా.. సాంకేతికంగా సౌండ్ అయిన నేవీ వారికి కూడా సాధ్యం కానిది.. మనోడుకు సాధ్యం కావటం మాత్రం గొప్పగా చెప్పక తప్పదు.