Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన మాట‌!..బాబు పాల‌న గాడి త‌ప్పుతోంది!

By:  Tupaki Desk   |   23 Sep 2017 4:29 AM GMT
ధ‌ర్మాన మాట‌!..బాబు పాల‌న గాడి త‌ప్పుతోంది!
X
ప్ర‌భుత్వంపై క్షేత్ర‌స్థాయిలో ఆగ్ర‌హం పెరుగుతోంద‌ని తెలిసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు దానిని నెమ్మ‌దిగా అధికారుల‌పై తోసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. విజ‌యాలు సాధించిన‌ప్పుడు అది త‌న ఒక్క‌డి క‌ష్టంగా.. స‌రైన ఫ‌లితాలు రాని స‌మ‌యంలో అందుకు అధికారుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్న ఆయ‌న తీరుపై అధికారులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు! అధికారుల‌తో గొడ్డు చాకిరీ చేయించుకుని.. చివ‌రికి వారిని బ‌లి ప‌శువులు చేసేలా మాట్లాడుతుండ‌టంపై మండిప‌డుతున్నారు. చంద్ర‌బాబు ఏం చేసినా.. ఏం చెప్పినా అంత‌కు ప‌దింతలు చూపించే మీడియా సంస్థ‌లు ఉండ‌గా.. ఇక ఇవ‌న్నీ బ‌య‌టికి ఎలా వ‌స్తాయనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది!

ఏపీ సీఎం చంద్ర‌బాబులో అస‌హ‌నం పెరుగుతోంద‌నే చర్చ మొద‌లైంది. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు స‌క్ర‌మంగా అమలు చేయ‌లేకపోతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆ ఫ్ర‌స్ట్రేష‌న్ అంతా అధికారుల‌పై చూపిస్తున్నారా? అనే సందేహాలు అంద‌రి లోనూ మొద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు చంద్ర‌బాబు తీరుపై వైఎస్సార్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. తన వైఫల్యాలను చంద్ర‌బాబు.. అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను చట్టాలకు అతీతంగా చూడాలని అధికారులకు చంద్రబాబు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బాబు తన పాలనను గాడి తప్పించేవిధంగా తీసుకెళ్తున్నారని గతంలోనే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందన్నారు.

పెన్షన్లు కూడా ఇవ్వలేని దుస్థితికి కలెక్టర్లను దిగజార్చార‌ని ధ‌ర్మాన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, లక్షల ఇళ్లు కట్టినట్టు పత్రికల్లో కథనాలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా మారిందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విద్య - వైద్యాన్ని వదిలేసి కార్పొరేట్‌ శక్తులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అన్ని సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి అధికారులపై నెపం నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకుని ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని చంద్రబాబుకు ధర్మాన ప్రసాదరావు హితవు పలికారు.