Begin typing your search above and press return to search.

బగ్గు పులి ఎత్తుగడ బాగుందా.. బెడిసికొడుతుందా..?

By:  Tupaki Desk   |   24 May 2015 10:01 AM GMT
బగ్గు పులి ఎత్తుగడ బాగుందా.. బెడిసికొడుతుందా..?
X
దేశంలో బగ్గు కుంభకోణం ఓ సంచలనం.. ఆ కుంభకోణంలో మన రాష్ట్రానికి చెందిన అప్పటి కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావుపైనా ఆరోపణలున్నాయి. ఆ కుంభకోణంలో ఆయన పేరు ఉందని మీడియాలో రాగానే ఆయన అప్పట్లో మండిపడిపోయారు. అందరి జాతకాలు బయటపెడతానంటూ బీరాలు పలికారు. కానీ.... ఛార్జిషీట్లు పెట్టి కోర్టుకు తీసుకొచ్చినా కూడా ఆయన ఎవరి జాతకమూ బయటపెట్టలేదు. సరికదా.... ఈ కేసులో పెద్దవాళ్లను లాగితే మెల్లగా లైట్‌ చేసేయొచ్చు అన్న ఎత్తుగడ వేస్తున్నట్లుగానూ కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఆయన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగును ఇందులోకి లాగేందుకు పదేపదే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

గనుల కేటాయింపుల ఫైళ్లనీ మన్మోహన్‌ కే పంపానని... తనకేమీ తెలియదని అంటున్నారు. దీనికి వెనుక కారణాన్ని కొందరు విశ్లేషిస్తున్నారు. బిర్లా కేసులో మన్మోహన్‌ సింగుపైనా కేసు పడింది. దాంతో సుప్రీంకోర్టు మెట్టెక్కాల్సి వచ్చిందాయన. ఆయన తరఫున బడాబడా లాయర్లు వాదించారు. దీంతో ఈ కేసులోనూ మన్మోహన్‌ ను ఇరికిస్తే ఇక్కడా ఆయన్ను బయటపడేయటానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తారు.. కేసు తేలిపోతుందన్నది దాసరి ఎత్తుగడగా పేర్కొంటున్నారు.

మన్మోహను బయటపడితే తానూ బయటపడొచ్చని దాసరి భావిస్తున్నారంటున్నారు. అయితే... ఈ కేసులో మన్మోహన్‌ గనుల కేటాయింపు ఫైలును అనుమానించి మంత్రిత్వ శాఖకు తిప్పి పంపారని.. కాబట్టి ఇందులో మన్మోహన్‌ ప్రమేయమేమీ లేదని సీబీఐ తన ఛార్జిషీటులోనే పేర్కొందట. ఈలెక్క ప్రకారం అప్పటి ఆ మంత్రిత్వ శాఖ చూస్తున్న దాసరి మెడకే ఇది చుట్టుకోక తప్పేలా లేదు. అయితే... మన్మోహన్‌ ను ఇందులోకి లాగాలన్న దాసరి ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో... లేదంటే బెడిసికొడుతుందో వేచి చూడాలి.