Begin typing your search above and press return to search.

వార్న‌ర్ ఈజ్ బ్యాక్.. SRH ఈ సారి స‌త్తా చాటేనా?

By:  Tupaki Desk   |   28 Feb 2020 2:30 AM GMT
వార్న‌ర్ ఈజ్ బ్యాక్.. SRH ఈ సారి స‌త్తా చాటేనా?
X
ఐపీఎల్ జ‌ట్టు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న‌ర్ తిరిగి నియామ‌కం అయ్యాడు. గ‌త రెండు సీజ‌న్లుగా ఎస్ఆర్ హెచ్ జ‌ట్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ కెప్టెన్ గా ఉన్నాడు. గ‌త సీజ‌న్లో కొన్ని మ్యాచ్ ల‌కు భార‌త ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ కూడా కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. విలియ‌మ్స‌న్ ఆడ‌లేక‌పోయిన మ్యాచ్ ల విష‌యంలోనే భువీ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు.

ఇక వార్న‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఎస్ ఆర్ హెచ్ ను ఫామ్ లోకి తీసుకొచ్చి, విజేత‌గా నిల‌ప‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. 2016 సీజ‌న్లో ఐపీఎల్ విజేత‌గా హైద‌రాబాద్ జ‌ట్టు నిల‌వ‌డంలో కీల‌క పాత్ర వార్న‌ర్ దే. ఒక మాట‌లో చెప్పాలంటే ఒంటి చేత్తో ఆ సీజ‌న్లో జ‌ట్టును విజేత‌గా నిలిపాడు వార్న‌ర్. అయితే ఆ త‌ర్వాత అత‌డు వివాదాల పాల‌య్యాడు. ఆసీస్ త‌ర‌ఫున ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టులో బాల్ ట్యాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్న‌ర్ తో స‌హా ఆసీస్ జ‌ట్టు ఆట‌గాళ్లు మ‌రి కొంద‌రిపై ఏడాది నిషేధం విధించింది. దీంతో ఈ క్రికెట‌ర్ అన్ని ర‌కాల క్రికెట్ కూడా ఏడాది పాటు దూరం అయ్యాడు.

క్రితం సీజ‌న్ స‌మ‌యానికే అందుబాటులోకి వ‌చ్చినా... కెప్టెన్సీ మాత్రం ద‌క్క‌లేదు. వార్న‌ర్ లేన‌ప్పుడు విలియ‌మ్స‌న్ కు ద‌క్కిన కెప్టెన్సీ అత‌డికే కొన‌సాగింది. ఇక గ‌త సీజ‌న్లో స‌న్ జ‌ట్టు ఓ మోస్త‌రుగా మాత్ర‌మే ఆడింది. ఈ నేప‌థ్యంలో విలియ‌మ్స‌న్ స్థానంలో మ‌ళ్లీ వార్న‌ర్ ను కెప్టెన్ గా చేసింది ఆ జ‌ట్టు యాజ‌మాన్యం.

త‌న‌కు తిరిగి కెప్టెన్సీ అప్ప‌గించినందుకు వార్న‌ర్ థ్యాంక్స్ చెప్పాడు. అలాగే మాజీ కెప్టెన్లు అవుతున్న విలియ‌మ్స‌న్ - భువ‌నేశ్వ‌ర్ ల స‌ల‌హాలు - సూచ‌న‌లు స్వీక‌రించ‌బోతున్న‌ట్టుగా వార్న‌ర్ ప్ర‌క‌టించాడు.