Begin typing your search above and press return to search.

సన్ రైజర్స్ కెప్టెన్ గా వార్నర్ ఔట్

By:  Tupaki Desk   |   28 March 2018 11:17 AM GMT
సన్ రైజర్స్ కెప్టెన్ గా వార్నర్ ఔట్
X
అనుకున్నదే అయింది. ఐపీఎల్ లో మరో కెప్టెన్ మీద వేటు పడింది. సన్ రైజర్స్ సారథ్యం నుంచి ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ను తప్పించారు. ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్ ప్రధాన నిందితుల్లో ఒకడిగా తేలాడు. ఆస్ట్రేలియా జట్టుకు వార్నర్ వైస్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. టాంపరింగ్ కు పాల్పడిన బాన్ క్రాఫ్ట్ అమాయకుడని.. కెప్టెన్ స్మిత్.. వైస్ కెప్టెన్ వార్నర్ కలిసే ఈ వ్యూహం రచించారని అంటున్నారు. అసలు ఈ ఆలోచన చేసిందే వార్నర్ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిన్న క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్.. వార్నర్.. బాన్ క్రాఫ్ట్ లను దోషులుగా తేలుస్తూ ఆ ముగ్గురినీ జట్టు నుంచి తప్పించి.. స్వదేశానికి పంపించేసిన సంగతి తెలిసిందే.

ఆ నిర్ణయం వెలువడి 24 గంటలు గడవకుండానే వార్నర్ పై సన్ రైజర్స్ వేటు వేసింది. వార్నర్ మూడేళ్లుగా సన్ రైజర్స్ జట్టులో కీలకంగా ఉంటున్నాడు. గత రెండేళ్లూ అతను జట్టును అద్భుతంగా నడిపాడు. 2016లో ఆ జట్టుకు టైటిల్ కూడా అందించాడు. అతడిని కెప్టెన్ గా తప్పించడం ఇబ్బందికర పరిణామమే. కనీసం వార్నర్ ఆటగాడిగా అయినా కొనసాగుతాడో లేదో తెలియదు. రేపట్లోపు ముగ్గురికీ శిక్షలు ప్రకటిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించిన సంగతి తెలిసిందే. దాన్ని బట్టి వార్నర్.. స్మిత్ ఐపీఎల్లో కొనసాగేది లేనిది తేలుతుంది. వార్నర్ స్థానంలో ధావన్ సన్ రైజర్స్ పగ్గాలు చేపట్టే అవకాశముంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ స్మిత్ స్థానంలో రహానెను కెప్టెన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.