Begin typing your search above and press return to search.

ఇండియాకు వ‌చ్చేస్తా: అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్?

By:  Tupaki Desk   |   21 Sep 2017 3:30 PM GMT
ఇండియాకు వ‌చ్చేస్తా: అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్?
X
అండర్‌వరల్డ్‌ డాన్‌ - మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావూద్‌ ఇబ్రహీం ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ముంబై పేలుళ్ల‌తో స‌హా అనేక నేరాల‌కు పాల్ప‌డ్డ ఈ నొటోరియ‌స్ క్రిమిన‌ల్ ఎలాగైనా పట్టుకోవాలని కేంద్రం చాలా కాలం నుంచి ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, దావూద్ కు దాయాది దేశం పాకిస్థాన్ మ‌ద్ద‌తుండ‌డంతో అక్క‌డ ఆశ్ర‌యం పొందుతూ త‌న కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నాడు. కేంద్రాన్ని ముప్పుతిప్ప‌లు పెడుతున్న డీ గ్యాంగ్ అధినేత గురించి తడు కేంద్రంతోనే సంప్రదింపులు జరుపుతున్నట్లు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎం ఎన్ ఎస్‌) అధినేత రాజ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్ర‌స్తుతం దావూద్ తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడ‌ని, భార‌త్ లో త‌న చివ‌రి రోజులు గ‌డ‌పాల‌నుకుంటున్నాడ‌ని ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతో దావూద్ చర్చలు కూడా జరుపుతున్నాడని ఠాక్రే ఆరోపించారు. ఈ విష‌యాల‌న్నింటినీ ఆయ‌న త‌న ఫేస్‌ బుక్ అకౌంట్ నుంచి లైవ్ వీడియో ద్వారా చెప్పారు.

త్వ‌ర‌లోనే దావూద్ భార‌త్ కు తిరిగి వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఠాక్రే అన్నారు. అయితే, దావూద్ లొంగిపోయిన‌ప్ప‌టికీ ఆ క్రెడిట్ ను బీజేపీ త‌న ఖాతాలో వేసుకునేందుకు చూస్తోంద‌ని ఆరోపించారు. ‘దావూద్‌ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు. తన చివరి రోజులను స్వదేశంలో గడపాలనుకుంటున్నాడు. భారత్‌కు వచ్చేందుకు బీజేపీ ప్ర‌భుత్వంతో చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే అతడు తిరిగొచ్చే అవకాశం ఉంది’ అని ఠాక్రే అన్నారు. దావూద్ స్వ‌చ్ఛందంగా భారత్‌ కు రావాలనుకుంటున్నాడ‌ని, అయితే కేంద్రం మాత్రం దానిని త‌మ విజయంగా చెప్పుకొని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని ఠాక్రే ఆరోపించారు. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ - ఎం ఎన్ ఎస్ లు పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇరు పార్టీల మ‌ధ్య విభేదాలు రావ‌డంతో బీజేపీ స‌ర్కార్ పై ఠాక్రే విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కు పెట్టారు. సంద‌ర్భానుసారంగా మోదీ స‌ర్కార్ పై మండిప‌డుతున్నారు. అయితే, ఠాక్రే వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.

మ‌రోవైపు, డబ్బుల కోసం బిల్డర్‌ ను బెదిరించిన కేసులో దావూద్‌ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్‌ ఇబ్రహీం కస్కర్ సోమ‌వారం అరెస్ట‌యిన సంగ‌తి తెలిసిందే. పోలీసుల‌ విచార‌ణ‌లో దావూద్ గురించి క‌స్క‌ర్ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. మోదీ స‌ర్కార్‌ అధికారంలోకి వచ్చాక పాక్ లో దావూద్‌ నాలుగు ఇళ్లు మారాడని చెప్పాడు. అక్క‌డ తన భద్రతను మరింత పెంచుకున్నాడని తెలిపాడు. త‌న‌ ఆచూకీ తెలియ‌కూడ‌ద‌ని కుటుంబ సభ్యులతో ఫోన్‌ కూడా మాట్లాడేవాడు కాద‌ట‌. దావూద్ కు లాటిన్‌ అమెరికా డ్రగ్స్‌ వ్యాపారులతోనూ సంబంధాలున్నాయని క‌స్క‌ర్ వెల్లడించాడు. క‌స్క‌ర్ వెల్ల‌డించిన విష‌యాల నేప‌థ్యంలో ఠాక్రే వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి.

దావూద్ ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక ఆస్తులు క‌లిగిన రెండో మాఫియా డాన్ గా ఫోర్బ్స్ ప‌త్రిక కొద్దిరోజుల క్రితం పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు మోసిన క్రిమిన‌ల్స్ లో ఒక‌డైన దావూద్ భ‌యాన్నే పెట్టుబ‌డిగా పెట్టి వేల కోట్ల ఆస్తులను కూడ‌బెట్టాడు. బ్రిటన్‌లో దావూద్ ఆస్తుల జప్తు నేపథ్యంలో దావూద్‌ ఆస్తుల గురించిన అనేక‌ విషయాలను వెల్లడించింది. బ్రిట‌న్ ప్ర‌భుత్వం దావూద్ ఆస్తుల‌ను జ‌ప్తు స‌మ‌యంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. 2015నాటికి దావూద్‌ 6.7బిలియన్ డాలర్ల విలువ గ‌ల నికర ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆ ప‌త్రిక‌ పేర్కొంది. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతం నుంచి దావూద్ తన క్రైమ్ నెట్ వర్క్ ను ర‌న్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దావూద్ పేరుమీద వార్‌విక్‌షైర్‌లో ఓ ఖ‌రీదైన హోట‌ల్ కూడా ఉంది. రెసిడెన్స్ ప్రాప‌ర్టీల‌పై ప్ర‌స్తుతం బ్రిట‌న్ ప్ర‌భుత్వం నిఘా పెట్టింది. దావూద్‌కు చెందిన కొన్ని ఫైల్స్‌ను 2015లో బ్రిట‌న్‌కు భార‌త్ అంద‌జేసింది. వాటితోనే దావూద్ ఆస్తుల‌ను బ్రిట‌న్ సీజ్ చేసింది. ఈ ఘ‌ట‌న‌తో దావూద్ ను అరెస్ట్ కాకుండా కాపాడుతున్న దాయాది దేశానికి గ‌ట్టి దెబ్బ త‌గిటిన‌ట్ల‌యింది. దావూద్ ఆస్తుల జ‌ప్తుతో భార‌త్ దౌత్య‌ప‌ర‌మైన విజ‌యం సాధించిన‌ట్లేన‌ని అధికారులు భావిస్తున్నారు.