Begin typing your search above and press return to search.

రోజులో మాట మార్చిన దాయాది.. దావూద్ పాక్ లో లేడట

By:  Tupaki Desk   |   23 Aug 2020 7:50 AM GMT
రోజులో మాట మార్చిన దాయాది.. దావూద్ పాక్ లో లేడట
X
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడన్న విషయాన్ని ఎట్టకేలకు ఒప్పుకున్న దాయాది.. 24 గంటలు గడిచేసరికి మాట మార్చేసింది. మీడియాలో వస్తున్నట్లుగా దావూద్ తమ దగ్గర లేడని చెప్పిన పాక్.. తనది నరం లేని నాలుకన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. దావూద్ కరాచీలో ఉన్నాడని.. అతన్ని టెర్రరిస్టుల జాబితాలో చేర్చిన దాయాది.. వెంటనే యూటర్న్ తీసుకోవటం గమనార్హం.

తాజాగా ఆ దేశం చెబుతున్న మాటల ప్రకారం.. దావూద్ అసలు తమ దేశంలోనే లేడని.. భారత మీడియా కావాలనే అతను తమ దేశంలో ఉన్నట్లుగా తాము అంగీకరించినట్లుగా ప్రచారం చేస్తుందని పేర్కొంది. తాజాగా పాక్ 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు.. వాటి అధినేతలపై కఠిన ఆంక్షల్ని విధించటం తెలిసిందే. ఈ జాబితాలో దావూద్ పేరు కూడా ఉంది. వీరికి సంబంధించిన స్థిర.. చర ఆస్తుల్ని సీజ్ చేసి.. బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేస్తున్నట్లుగా పేర్కొంది.

దీనికి సంబంధించిన రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ జాబితాలో దావూద్ పేరు ఉండటంతో.. ఇంతకాలం భారత్ చేసిన వాదన నిజమని తేలింది. ఎప్పుడైతే.. జాబితా బయటకు వచ్చి.. పాక్ బండారం బయటకు రావటం.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ఈ విషయానికి ప్రాధాన్యత లభించటంతో.. పాక్ సర్దుకుంది. తన తప్పును కవర్ చేసుకునేందుకు భారత్ ను బద్నాం చేయటం ప్రారంభించింది.

తాజాగా పాక్ విదేశాంగశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. తాము కొత్తగా ఎలాంటి నివేదిక వెల్లడించలేదని.. ఎలాంటి ఆంక్షల్ని విధించలేదని పేర్కొంది. భారత మీడియానే కావాలనే కథనాలు అల్లుతుందని చెప్పింది. ‘‘భారత మీడియా ఒక రిపోర్టును చూపిస్తూ పాకిస్తాన్ ఏవో కొత్త ఆంక్షలు విధించినట్లుగా కథనాలు నడిపిస్తోంది. అది సరికాదు. దావూద్ పాక్ లోనే ఉన్నట్లు అంగీకరించిందని మీడియా వర్గాలు చెప్పటం నిరాధారం.. అంతా కల్పితం’’ అంటూ విదేశాంగ శాఖ పేర్కొనటం గమనార్హం.