Begin typing your search above and press return to search.

దావూద్ ఆస్తుల అమ్మ‌కం..కేంద్రం చెప్పిన ధ‌ర?

By:  Tupaki Desk   |   19 Oct 2017 9:15 AM GMT
దావూద్ ఆస్తుల అమ్మ‌కం..కేంద్రం చెప్పిన ధ‌ర?
X
అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆస్తుల అమ్మేసే ఎపిసోడ్‌ లో కీల‌క ముంద‌డుగు ప‌డింది. ముంబైలోని హోట‌ల్ రౌనాక్ అఫ్రోజ్‌ ను వేలం వేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో పాటుగా దావుద్ ఇబ్ర‌హీంకు చెందిన మ‌రో ఐదు ఆస్తుల‌ను సైతం అమ్మ‌కానికి పెడుతూ వేలం ధ‌ర‌ను కూడా ప్ర‌క‌టించింది. స్మ‌గ్ల‌ర్స్ ఆండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేట‌ర్స్ యాక్ట్ తాజాగా ఈ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం దావుద్‌ కు చెందిన ఆరు ఆస్తులను న‌వంబ‌ర్ 14వ తేదీన వేలం వేయ‌నున్నారు. వీటి బేస్ ప్రైస్‌ గా రూ.5.54 కోట్లను ప్ర‌క‌టించింది. ఈ ఆస్తుల్లో ఇటీవ‌లి కాలం వ‌ర‌కు దావుద్ సోద‌రుడు ఇక్బాల్ క‌స్క‌ర్ నివాసం ఉన్న బెండిబ‌జార్ స‌మీపంలోని ద‌మ‌ర్‌ వాలా భ‌వ‌నం కూడా ఉంది. 1980ల్లో దేశం విడిచి పారిపోయేవర‌కు దావుద్ ఇబ్ర‌హీం ఇదే కాల‌నీలో నివాసం ఉండేవారు. దావుద్ సోద‌రుడితో పాటుగా ఆయ‌న త‌ల్లి సైతం ఈ ఇంట్లో నివ‌సించే వారని ఆ కాల‌నీలో నివాసం ఉండే ఓ మ‌హిళ తెలిపింది. ఇక దావూద్‌ కు చెందిన‌ మిగ‌తా ఆస్తుల విష‌యానికి వ‌స్తే...మొహ‌మ‌ద్ అలీ రోడ్‌ లోని ష‌బ్నం గెస్ట్‌ హౌస్ - మ‌జ‌గావ్‌ లోని పెర్ల్ హ‌ర్బ‌ర్ బిల్డింగ్‌ - దాద్రీవాలోని ఓ నివాసంలో గ‌ల కిరాయి హ‌క్కులు - ఔరంగాబాద్‌ లోని ఓ ఫ్యాక్ట‌రీపై హ‌క్కులు వంటివి దావుద్ ఆస్తుల్లో ఉన్నాయి. ఈ ఆస్తుల‌న్నీ వ్యాపార - వాణిజ్య‌సంబంధ‌మైన‌వి కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఈ ఆస్తుల‌ను వేలం వేయ‌గా జ‌ర్న‌లిస్ట్ ఎస్‌.బాల‌కృష్ణ‌న్ నేతృత్వంలోని దేశ్ సేవా స‌మితి రూ.4.28 కోట్ల అత్య‌ధిక బిడ్డింగ్ ధ‌రను హోట‌ల్ రౌనాక్ అఫ్రోజ్‌ కు ప్ర‌క‌టించింది. రూ.30 ల‌క్ష‌లు జ‌మ‌చేసిన‌ప్ప‌టికీ మిగ‌తా మొత్తాన్ని డిపాజిట్ చేయ‌లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ ఆస్తిని సొంతం చేసుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో స్మ‌గ్ల‌ర్స్ ఆండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేట‌ర్స్ యాక్ట్ విభాగం డిపాజిట్ మొత్తాన్ని త‌గ్గించి రూ.23.72 ల‌క్ష‌ల‌కు ఖరారు చేసింది.