Begin typing your search above and press return to search.

వెళ్లి చూశాం... దావూద్ లేడు!

By:  Tupaki Desk   |   29 Aug 2015 4:25 AM GMT
వెళ్లి చూశాం... దావూద్ లేడు!
X
ఏదో నేర్చినమ్మ... బోంకు నేర్వదా అనే ఒక ముతక సామెత గుర్తుకు వస్తుంది పాక్ వైఖరి చూస్తుంటే! అబద్దాలు చెప్పడంలోనూ, అప్రకటిత కాల్పులు జరపడంలోనూ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి భారత్ పైకి ఉసిగొల్పడంలోనూ పాక్ వైఖరి మారడం లేదు. ఎదురుగా పోరాడే ధమ్ము లేదు, వెనక నుండి చేసే పనులైనా కనీసం చెప్పుకునే ధైర్యమూ లేదు! ఇదే క్రమంలో తాజాగా నిస్సిగ్గు గా అబద్దాలు చెబుతుంది పాక్!

ఇప్పటికే దావూద్ కు సంబందించి ఇంటి అడ్రస్ (డి-13, బ్లాక్ నెంబర్-4, కరాచీ డెవ‌ల‌ప్ మెంట్ ఆథారిటీ, ఎస్సీహెచ్-5, క్లిప్ట‌న్), ఫోన్ నెంబర్ తో సహా సంపాదించి.. ప్రపంచం ముందు ఉంచింది భారత నిఘా వ్యవస్థ. దీన్ని బలపరుస్తూ... ఒక జాతీయ మీడియా నేరుగా దావుద్ భార్య మెహ‌జ‌బీన్ షేక్ తోనే ఫోన్ లో మాట్లాడి.. నిఘా వ్యవస్థ చెప్పిన విషయానికి బలం చేకూర్చింది. ఆమెతో మాట్లాడిన ఫోన్ సంబాషణను కూడా బయటపెట్టింది. ఇదే సమయంలో దావూద్ ఇంటికి వెళ్లి చూశానని, అతడు.. పాక్ సహకారంతో హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నాడని చెప్పారు పాక్ జర్నలిస్ట్!

ఇన్ని సాక్ష్యాదారాలు చూపిస్తున్నా.. అలవాటుగా మారిన అసత్యాలను వీడటం లేదు పాక్. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని భారత్ చేస్తున్నవి కేవలం ఆరోపణలే అని... వాటిని ఖడిస్తున్నామని చెబుతున్నారు పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీలుల్లా. మరి అడ్రస్ సంగతి ఏంటంటే... అదంతా ఫేక్ అడ్రస్ అని! ఆ చిరునామాను తాము సంప్రదించామని, అక్కడ దావూద్ లేడని, భారత్ చెప్పిన అడ్రస్ లో లేడంటే.. పాక్ లో లేనట్లేగా.. అని చిన్నపిల్లలకు చెప్పే కబుర్లు చెప్పుకొస్తున్నారు.

ఈ స్థాయిలో ఉన్న పాక్ వక్రబుద్ది, అసత్యపు అలవాట్ల బ్రతుకు మారే ఆలోచన లేనట్లే. ఇదే క్రమంలో న్యూయార్క్ వేదికగా సెప్టెంబరులో జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత ప్రధాని మోడీ - పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ల భేటీ ఉంటుందని, ఈ సారి ఉగ్రవాదం అంశం చర్చల్లోకి వస్తుందని ఆశిస్తున్నవారికి చేదు వార్తగా... అటువంటి భేటీలు, వాటి తాలూకు ప్రతిపాధనలు ఏమీ లేవని.. ఇష్టం లేని పనిని సంతోషంగా చెబుతుంది పాక్!