Begin typing your search above and press return to search.

చోటాను లేపేసే దావూద్ ప్లాన్?

By:  Tupaki Desk   |   27 Dec 2017 8:52 AM GMT
చోటాను లేపేసే దావూద్ ప్లాన్?
X
అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇప్ప‌టికీ త‌న హ‌త్యారాజ‌కీయాలు కొన‌సాగిస్తున్నారు. త‌న‌కు పోటీ అయిన‌ మరో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ హత్యకు ప్లానేశాడు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. తీహార్ జైల్లో ఉంటున్న చోటాను హత్య చేయాలని డీ గ్యాంగ్ ప‌క్కా ప్లాన్‌ తో రెక్కీ నిర్వ‌హిస్తున్న‌ట్లు సమాచారం. దీంతో జైలులో భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.

దాదాపు 20 ఏళ్ల నుంచి చోటా రాజన్‌ను హత్య చేయాలని డీ గ్యాంగ్ ప్లాన్ వేస్తోంది. దీని కోసం ఆ గ్యాంగ్ తీహార్ జైలులో శిక్ష పొందుతున్న బవానాను కూడా కలిసింది. దీంతో తీహార్ జైలులోనే ఉంటున్న మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను స‌రైన వ్య‌క్తిగా గుర్తించారు. చోటా రాజన్ - నీరజ్ బవానాలు ఒకే జైలులో ఉండేవారు. అయితే ఈ విష‌యాన్ని ఇంటెలిజెన్స్ ప‌సిగ‌ట్టింది. నీర‌జ్ బ‌వానాకు చెందిన ఓ వ్యక్తి ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్‌కు వెల్లడించాడు. గ్యాంగ్‌ స్టర్ నీరజ్‌ కు అనుబంధం ఉన్న అతను కూడా ఓ చిన్నపాటి ముఠా నాయకుడే. ప్రస్తుతం అతను బెయిల్‌ పై ఉన్నాడు. అతన్ని విచారించిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. తాగిన మైకంలో ఫోన్‌ లో మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాలను పోలీసులు గుర్తించారు.

కాగా, ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఇద్దర్ని వేరు చేశారు. గ్యాంగ్‌ స్టర్ బవానా జైలు రూమ్‌ లో కొన్ని మొబైల్ ఫోన్లను కూడా ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే జైలు అధికారులు మాత్రం దావూద్ గ్యాంగ్ ప్రయత్నాలను కొట్టిపారేస్తున్నారు. బవానా కానీ డీ గ్యాంగ్ కానీ చోటా రాజన్‌ ను చేరలేరని జైలు అధికారులు చెప్పారు. రాజన్ కోసం జైలులో ప్రత్యేకంగా స్పెషల్ గార్డ్స్ ఉన్నారు. అతని భద్రత కోసం ప్రత్యేకంగా వంట చేసేవారు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే దావూద్ టార్గెట్ చేశార‌నేది నిజ‌మ‌ని అంటున్నారు.