Begin typing your search above and press return to search.

ముంబాయిలోకి దిగిన డి-కంపెనీ స్నైపర్స్‌!

By:  Tupaki Desk   |   5 Nov 2015 1:03 PM GMT
ముంబాయిలోకి దిగిన డి-కంపెనీ స్నైపర్స్‌!
X
షూటర్‌ అంటే మనకు తెలుసు. అతడు సినిమాలో 'మహేష్‌ బాబు' లాంటి వాడన్న మాట. బాగా దూరంలో ఉన్న టార్గెట్‌ ను కూడా గురి తప్పకుండా కాల్చగలిగే వాడు. 'బాగా దూరం' అంటే సుమారుగా సినిమాలో చూపించినట్లుగా.. మైదానంలో మీటింగు జరుగుతోంటే.. పక్కనే ఉన్న బిల్డింగు మీదనుంచి కాలుస్తాడు. కానీ ఇలాంటి షూటర్‌ లలోనే ఒక అప్‌ గ్రేడెడ్‌ వెర్షన్‌ ఉంటుంది. వారిని 'స్నైపర్స్‌' అంటారు. వారు ఇంకాస్త ముదురు షూటర్ లన్నమాట. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా గురితప్పకుండా కణతకు కాల్చాలనుకుంటే కణతకే కాల్చగలరు. అంతటి ప్రతిభావంతులు. దానికి తగిన అత్యాధునిక తుపాకులను ఉపయోగిస్తారు. పైగా.. తాము కాల్చే బుల్లెట్‌ అంత దూరం ప్రయాణించాలి గనుక.. గాలి వాటు ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది.. గాలి ఎంత వేగంతో వీస్తోంది .. ఇలాంటి లెక్కలన్నీ వేసుకుని.. ఆ గాలి రాకడను బట్టి తుపాకీ గుండు వెళ్లడంలో ఎలాంటి మార్పులు వస్తాయో అవన్నీ కూడా గణించి.. వారు గురి తప్పకుండా లెక్కలు వేసుకుని కాలుస్తారు. స్నైపర్‌ లు అంటే ఏమాత్రం లెక్క తప్పకుండా షూట్‌ చేయగల వాళ్లన్నమాట.

ప్రస్తుతం ముంబాయి నగరంలో డి- కంపెనీ అదే దావూడ్‌ మాఫియా కంపెనీకి చెందిన స్నైపర్ లు రంగంలోకి దిగి ఉన్నట్లుగా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ మేరకు పోలీసు ఇంటెలిజెన్స్‌ వర్గాల్లో సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఛోటా రాజన్‌ ను ఇవాళ ఇండోనేషియా బాలినుంచి ముంబాయికి తీసుకురానున్నారు.

ఛోటారాజన్‌ కు - మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు బద్ధవైరం ఉన్న సంగతి తెలిసిందే. ఛోటారాజన్‌ ఇండియా చేజిక్కి, విచారణలో నోరు విప్పితే గనుక.. దావూద్‌ గురించి అనేక భయంకరమైన నిజాలు సాక్ష్యాధారాల సహా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా దావూద్‌ నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని చోటా రాజన్‌ స్వయంగా చెప్పుకుంటున్నాడు. ముంబాయిలో పోలీసుల్లో కూడా కొందరు దావూద్‌ ఏజెంట్లు ఉన్నారని., వారినుంచి కూడా తనకు హాని ఉండవచ్చునని రాజన్‌ చెప్పిన సంగతి అందరికీ తెలుసు.

ముంబాయి పోలీసులు మాత్రం రాజన్‌ ను చాలా జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలో ఉంచి విచారించడానికి ముంబాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భారత్‌కు తీసుకు వచ్చిన తర్వాత.. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఆయనను ఏదైనా ఒక నిర్దిష్ట ప్రదేశానికి తరలించే వరకు, తరలించిన తర్వాత కూడా వాహనాలపై దాడి జరిగే అవకాశం ఉన్నదని పోలీసు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి. దావూద్‌ మనుషులు - స్నైపర్లు ఇప్పటికే ముంబాయిలో పొంచి ఉన్నారని.. ఇక్కడి విమానాశ్రయంలో దిగినప్పటినుంచి ఏ క్షణాన ఎలాంటి చిన్న అవకాశం దొరికినా.. ఛోటారాజన్‌ ను మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారని అనుమానిస్తున్నారు. మరి రాజన్‌ ను సురక్షితంగా ఉంచి కీలక రహస్యాలను రాబట్టడంలో ముంబాయి పోలీసుల సత్తా ఏమిటో ఈ ఎపిసోడ్‌ లో తేలనుంది.