Begin typing your search above and press return to search.

బాబా భక్తులకి గుడ్ న్యూస్ .. ముగిసిన షిరిడి బంద్ !

By:  Tupaki Desk   |   20 Jan 2020 5:55 AM GMT
బాబా భక్తులకి గుడ్ న్యూస్ .. ముగిసిన షిరిడి బంద్ !
X
గత కొన్ని రోజులుగా సాయినాధుడి జన్మస్థలం పై పెద్ద వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. సాయి జన్మస్థలం పాథ్రీ అని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ప్రకటించడం , పాథ్రీలో ఉన్న ‘సాయి జన్మస్థాన్ మందిర్’ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించడంతో ఈ వివాదం మొదలైంది. అయితే ,ఈ వ్యవహారం పై ఈ రోజు సీఎం సమీక్ష జరపనుండటం తో సీఎం ఉద్దవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిర్డీలో జరుగుతోన్న బంద్ ముగిసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బంద్‌ను నిలిపివేస్తున్నట్లు షిర్డీవాసులు ప్రకటించారు.

అయితే , సీఎం వ్యాఖ్యలకి నిరసనగా ఆదివారం షిర్డీ తో పాటుగా చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలు బంద్‌ పాటించారు. ఇక బంద్ సమయం లో హోటళ్లు, రెస్టారెంట్లు, ధర్మశాలలు, ప్రైవేట్ వాహనాలు అన్నీ కూడా మూసి ఉన్నాయి. అయితే ఆలయ దర్శనాలు, పూజలు మాత్రం యధా విధిగా కొనసాగాయి. అటు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆహరం, తాగునీరు తదితర సౌకర్యాలన్నింటిని కూడా స్థానికులు కల్పించారు. గ్రామస్తులు, భక్తులు ద్వారకామాయి ఆలయం నుంచి సాయి ఆలయం వరకు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు.

ఈ సందర్భంలో అయితే పాథ్రీని అభివృద్ధి చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సంస్థాన్ ట్రస్ట్ మాజీ సభ్యుడు సచిన్ థాంబ్ తెలిపారు. బాబా ఎన్నడూ కూడా తన జన్మస్థలం పాథ్రీనేనని చెప్పలేదు.. అలాంటప్పుడు బాబా జన్మించింది పాథ్రీ అని ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు. సీఎం వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. కాగా, ఇవాళ సీఎం ఉద్దవ్ థాక్రే షిర్డీ, పాథ్రీకి చెందిన స్థానికులు, షిర్డీ ఎమ్మెల్యే విఖే పాటిల్, ఎంపీ లోఖండే, సంస్థాన్ ట్రస్ట్ సీఈఓ దీపక్‌ ముగ్లీకర్‌‌ లతో ఈ విషయం పై చర్చించనున్నారు.