Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ లో శవాల కుప్పలు.. శాటిలైట్ చిత్రాలు వైరల్

By:  Tupaki Desk   |   4 April 2022 9:31 AM GMT
ఉక్రెయిన్ లో శవాల కుప్పలు.. శాటిలైట్ చిత్రాలు వైరల్
X
ఉక్రెయిన్ లో మారణహోమాలు వెలుగుచూస్తున్నాయి. అక్కడి ప్రజలను చంపి వీధులుపై శవాల గుట్టలను రష్యా సైనికులు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్ ప్రజలను చేతులను వెనక్కి కట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి తలపై కాల్చారని అక్కడి మృతదేహాలను చూస్తే అర్థమవుతోంది.

ఉక్రెయిన్ వీధుల్లో రష్యా సేనల బీభత్సం తాజాగా వెలుగుచూసింది. యుద్ధంలో మానవత్వం మరిచి అమాయక ప్రజలను చంపినట్టు తేలింది. మృతుల్లో పసిపిల్లలున్నా వదిలిపెట్టలేదని తెలుస్తోంది.

ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు సమీపంలో 'బుచా' పట్టణంలో ఒకే చోట దాదాపు 300 మంది పౌరులు నిర్జీవంగా పడి ఉన్నాయి. తాజాగా ఆ మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఆ భౌతిక కాయాలను ఖననం చేసేందుకు 45 అడుగుల పొడవైన కందకం తవ్వినట్టు తేలింది.

మార్చి 10న సెయింట్ ఆండ్రూ చర్చి వద్ద గుంత తవ్విన శాటిలైట్ చిత్రాలు కనిపించాయి. తాజాగా మార్చి 31న చర్చి సమీపంలో సుమారు 45 అడుగుల పొడవైన కందకం తవ్వినట్లు కనిపిస్తోంది' అని మాక్సర్ టెక్నాలజీస్ వెల్లడించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 37 కిలోమీటర్ల దూరంలో ఈ దయనీయ దృశ్యాలు ఉన్నాయని మీడియా సంస్థలు తెలిపాయి.

ఒక చర్చిలో సామూహిక ఖననం జరిపిన తర్వాత మృతదేహాల చేతులు, కాళ్లు పైకి పొడుచుకున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇది రష్యా మారణకాండ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ మంత్రి దిమిత్రి కులేబా మండిపడ్డారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న వారినీ రష్యా సైనికులు వదలలేదని 'బుచా మేయర్' భోరుమన్నారు.

ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. ఇది రెచ్చగొట్టే తీరు అంటూ పేర్కొంది. అమెరికా, యూరప్ మీడియా కోసం కీవ్ పాలకవర్గం చేస్తోన్న మరో ప్రదర్శన అంటూ మండిపడింది. ఈ ప్రాంతం రష్యా ఆధీనంలో ఉన్న సమయంలో ఏ ఒక్క స్థానికుడిపై కూడా హింస జరగలేదని వివరణఇచ్చారు.