Begin typing your search above and press return to search.

శివ‌సేన‌ కు సీఎం, ఎన్సీపీ కి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ కు స్పీక‌ర్‌

By:  Tupaki Desk   |   11 Nov 2019 9:33 AM GMT
శివ‌సేన‌ కు సీఎం, ఎన్సీపీ కి డిప్యూటీ సీఎం,  కాంగ్రెస్‌ కు స్పీక‌ర్‌
X
మ‌హా పాలిటిక్స్‌లో నెల‌కొన్న ట్విస్టు గంట గంట‌కు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ ఏర్పాటుకు రెండో పెద్ద పార్టీగా ఉన్న శివ‌సేన‌ను ఆహ్వానించ‌డంతో శివ‌సేన నేత‌లు హుటాహుటీన ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఇక ఇప్పుడు ప్ర‌భుత్వం ఏర్పాటు ప్ర‌క్రియ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మూడు పార్టీలు ఓ అంగీకారానికి వ‌చ్చాయ‌ని కూడా ఢిల్లీలో వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

ఇక ముందు నుంచి సీఎం పీఠం కోసం ప‌ట్టుబ‌ట్టిన శివ‌సేన‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్నారు. డిప్యూటీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఎన్సీపీకి.. స్పీక‌ర్ ప‌ద‌వి కాంగ్రెస్‌కు ఇచ్చేలా మూడు పార్టీల నేత‌లు ఓ అంగీకారానికి వ‌చ్చాయ‌ని స‌మాచారం. దీనిపై మూడు పార్టీల సంయుక్త నేత‌లు సైతం క‌లిసి ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. మ‌రోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే శివ‌సేన నేత‌లు ప్ర‌క‌టించారు.

ఇక ఈ రోజు ఉద‌యం శివ‌సేన‌కు మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంపై ఢిల్లీలో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీతో స‌మావేశ‌మ‌య్యాక ఆ పార్టీ నేతలు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం ఓకే చెప్పారు. ఇక కాంగ్రెస్ నిర్ణ‌యం కోసం ఎన్సీపీ నేత శ‌ర‌ద్‌ప‌వార్ వెయిటింగ్‌లో ఉన్నారు. ఇక ప్ర‌భుత్వ ఏర్పాటుకు శివ‌సేన‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన టైం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆ పార్టీ కీల‌క నేత, ఎంపీ సంజ‌య్ రౌత్ ఢిల్లీలో మ‌కాం వేసి కాంగ్రెస్‌, ఎన్సీపీ నేత‌ల‌తో వ్య‌వ‌హారాన్ని చ‌క్క‌బెడుతున్నారు.

ఈ నేపథ్యంలో గవర్నర్‌తో శివసేన అధినేత‌ ఉద్దవ్‌ ఠాక్రే భేటీ అవుతారని సమాచారం. ఉద్ద‌వ్‌నే మ‌హారాష్ట్ర సీఎం ప‌ద‌వి చేప‌డ‌తార‌న్న వార్త‌లు కూడా ఢిల్లీ మీడియా స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీలును బ‌ట్టి ఎన్సీపీతో పాటు కాంగ్రెస్‌కు సైతం చెరో ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌న్న మ‌రో టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏదేమైనా సోమ‌వారం సాయంత్రానికి ప్ర‌భుత్వ ఏర్పాటుపై పూర్తి క్లారిటీ రానుంది. మొత్తానికి 15 రోజులుగా నేష‌న‌ల్ పాలిటిక్స్‌ను కుదిపేస్తోన్న మ‌హా రాజ‌కీయం ఎలా ముగుస్తుందో ? చూడాలి