Begin typing your search above and press return to search.

పిల్ల‌ల‌ను రేప్ చేస్తే ఏకంగా ఉరేస్తారు !

By:  Tupaki Desk   |   21 April 2018 11:55 AM GMT
పిల్ల‌ల‌ను రేప్ చేస్తే ఏకంగా ఉరేస్తారు !
X
రేప్ జ‌ర‌గ‌డం వేరు. అది రాజ‌కీయ ప్ర‌భావం చూప‌టం వేరు. ప్ర‌తి రోజు దేశంలో ఆరు నిమిషాల‌కో రేప్ జ‌రుగుతూ ఉంటుందట‌. నిర్భ‌య త‌ర్వాత దేశం మొత్తం అంత చ‌ర్చ‌నీయాంశ‌మైన రేప్ కేసు ఆసిఫాదే. కొంత మంది క్రూరులు ఎనిమిదేళ్ల చిన్నారిని గ్యాంగ్ రేప్ చేయ‌డ‌మే అత్యంత అమాన‌వీయ‌మైతే, ఆ చిన్నారికి ఆ స‌మ‌యంలో డ్ర‌గ్స్ ఇచ్చి మ‌రీ ఈ దురాగ‌తానికి పాల్ప‌డ‌టం మాన‌వ జాతికే మ‌చ్చ‌. ఓ ఆల‌యంలో రేప్ జ‌ర‌గ‌డం, అందులో బీజేపీ స‌భ్యుల పాత్ర‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో దేశం మొత్తం దుమారం రేగింది. పైగా నిందితుల‌కు మ‌ద్ద‌తుగా తీసిన ర్యాలీలో జ‌మ్ముకాశ్మీర్ లోని కొంద‌రు బీజేపీ నేత‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం బీజేపీని ఒక కుదుపు కుదిపింది. ఎన్నో ఉద్యోగాలుపోయాయి. మంత్రి ప‌ద‌వులు కూడా వ‌దులుకోవాల్సి వ‌చ్చిందంటే ఆ కేసు ఎంత తీవ్ర ప్రభావం చూపిందో తెలుస్తోంది.

ఈ భారీ నింద‌ను తుడుచుకోవ‌డానికి మోడీచేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లోనూ ఈ విష‌యాన్ని మోడీ ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది. దీంతో ఏదో ఒక గ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేం అని మోడీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. అందులో భాగంగా ఈరోజు ఒక కీల‌క ఆర్డినెన్స్ తెచ్చింది.

ఇక నుంచి ఎవ‌రైనా 12 ఏళ్ల లోపు వయస్సు కల్గిన చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధించేలా కేంద్రం అత్యవసర ఆదేశం తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ ఆర్డినెన్సు తెచ్చింది. కథువా, ఉన్నావ్‌ ఘటనల నేప‌థ్యంలో ఆ ఆందోళ‌న‌ల‌కు, నిర‌స‌న‌ల‌కు ఒక చ‌ర‌మ‌గీతం పాడ‌టానికి బీజేపీ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. పోక్సో చట్టానికి సవరణలు చేసింది.

ఈ చ‌ట్టం ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. అయితే, లైంగిక చర్య తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు స‌వ‌రించారు. ఆర్డినెన్సును వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో బిల్లుగా పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అప్పటివరకూ అమలులో ఉండేలా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ కు రాష్ట్రప‌తి ఆమోద‌మే త‌రువాయి. 2012, నవంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చ‌ట్టం కొత్త స‌వ‌ర‌ణ‌తో రాష్ట్రప‌తి ఆమోదం అనంత‌రం మ‌ళ్లీ అమ‌లుచేస్తారు.