Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ మాట‌ను ఓకే చేసిన కువైట్ రాజు

By:  Tupaki Desk   |   1 Oct 2017 5:12 AM GMT
చిన్న‌మ్మ మాట‌ను ఓకే చేసిన కువైట్ రాజు
X
చిన్న నేరాల‌కు సైతం పెద్ద పెద్ద శిక్ష‌లు విధించే అర‌బ్ దేశాల్లో ఒక‌టి కువైట్‌. నేరాల్ని అదుపు చేసేందుకు.. ఎవ‌రికి వారు నేరాల ఆలోచ‌న చేసేందుకు సైతం భ‌య‌ప‌డేలా శిక్ష‌లు అమ‌లు చేస్తుంటారు. నేరం చేసిన వారు ఎవ‌రైనా.. వారికి తీవ్ర‌మైన శిక్ష‌లు అమ‌లు చేస్తుంటారు. ఇందులో క్ష‌మాభిక్ష‌లు లాంటివి చాలా చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. అలాంటిది తాజాగా కువైట్ రాజు జాబ‌ర్ అల్ స‌బా సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు.

వివిధ నేరారోప‌ణ‌ల నేప‌థ్యంలో 15 మంది భార‌తీయ ఖైదీల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ల్ని విధించారు. అయితే.. వారు చేసిన నేరాల విష‌యంలో క్ష‌మాభిక్ష పెట్టాలంటూ కువైట్ రాజు భార‌త్ కోర‌టం.. అందుకు ఆయ‌న ఓకే చెప్పేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

అర‌బ్ దేశాల్లో క్ష‌మాభిక్షను ప్ర‌సాదించ‌టం చాలా అరుదుగా జ‌రిగే ప్ర‌క్రియ‌. మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేయాల్సిన భార‌తీయుల త‌ర‌ఫున‌.. వారిని క్ష‌మించాలని కోరారు. వారికి విధించిన మ‌ర‌ణ‌శిక్ష‌ల నుంచి విముక్తి చేయాల‌ని అభ్య‌ర్థించారు. భార‌త్ విన‌తిని కువైట్ రాజు సానుకూలంగా స్పందించారు.

15 మంది భార‌తీయ ఖైదీల‌కు మ‌ర‌ణ‌శిక్ష నుంచి క్ష‌మాభిక్షను ప్ర‌స్తాదించ‌టంతో పాటు.. వారి మ‌ర‌ణ‌శిక్ష‌ల్ని జీవిత ఖైదీలుగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అదే స‌మ‌యంలో మ‌రో 119 మంది భార‌తీయ ఖైదీల శిక్షా కాలాన్ని కూడా త‌గ్గిస్తూ నిర్ణ‌యం వెలువ‌డింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ స్పందించారు. ప్ర‌భుత్వ అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించినందుకు.. తాము కోరిన‌ట్లుగా చేసినందుకు కువైట్‌ రాజుకు కేంద్ర‌మంత్రి సుష్మా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

తాజా ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో జైళ్ల నుంచి విడుద‌ల కానున్న భార‌తీయ ఖైదీల విష‌యంలో భార‌త రాయ‌బారి కార్యాల‌యం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. స్మ‌గ్లింగ్‌.. హ‌త్యా నేరాలకు సంబంధించి భార‌తీయులు ప‌లువుర్ని కువైట్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారు చేసిన నేరాల్ని నిరూపించి.. దోషులుగా ఖ‌రారు చేశారు. శిక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. ఇలాంటి వేళ‌.. భార‌తీయులు చేసిన నేరాల్ని మ‌న్నించి.. వారికి క్ష‌మాభిక్ష ప్ర‌సాదించాలంటూ చేసిన అభ్య‌ర్థ‌న‌పై కువైట్‌రాజు పాజిటివ్ గా స్పందించ‌టంతో భార‌త్ లోని దోషుల కుటుంబ స‌భ్యులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కువైట్ రాజు తాజాగా క్ష‌మాభిక్ష పెట్టిన వారిలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు ఎంత మంది ఉన్నార‌న్న లెక్క ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.