Begin typing your search above and press return to search.

రైతు నిరసనలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ.. భారత్ తీవ్ర ఆగ్రహం

By:  Tupaki Desk   |   10 March 2021 5:30 AM GMT
రైతు నిరసనలపై బ్రిటన్ పార్లమెంటులో చర్చ.. భారత్ తీవ్ర ఆగ్రహం
X
వంద రోజులకు పైనే దేశ రాజధాని ఢిల్లీ శివారులో జరుగుతున్న రైతు శాంతియుత ఆందోళనలు.. మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ వ్యవహరించిన తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా బ్రిటన్ పార్లమెంటులో జరిగిన డిబేట్ పై అభ్యంతరాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఈ అంశంపై బ్రిటీష్ హైకమిషన్ కు సమన్లు జారీ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది.

దీనికి అంతర్జాతీయంగా పలువురు మద్దతు తెలపటం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో జరుగుతున్న రైతుల ఆందోళనకారుల భద్రత.. మీడియాస్వేచ్ఛపై బ్రిటీష్ పార్లమెంటులో తాజాగా గంటన్నర పాటు చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా బ్రిటన్ కు చెందిన పలు పార్టీలకు చెందిన ఎంపీలుపాల్గొని నిరసనకారులకు.. జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆందోళన కవరేజీల విషయంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదన్న ఆరోపణను.. బ్రిటన్ లోని భారత మూలాలు ఉన్న వారు ఆందోళన చెందుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రధానులు కలుసుకున్న సమయంలో ఈ అంశాల్ని ప్రస్తావిస్తారని బ్రిటన్ మంత్రి నీగెల్ ఆడమ్స్ వ్యాఖ్యానించటంసంచలనంగా మారింది. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది.

బ్రిటన్ పార్లమెంటులో జరిగిన చర్చపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చర్చను ఖండించింది. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటం సరికాదని పేర్కొంది. తప్పుడు వాదనలు చేయటం.. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంపై నిందలు వేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ పేర్కొంది. అంతేకాదు.. లండన్ లోని భారత హైకమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉండాలని యూకేకు భారత్ చురకలు అంటించటమే కాదు.. భారత్ పై ఎవరైనా నిందారోపణలు చేయాలనుకుంటే అన్నీ నేరుగా చేయాలని తేల్చి చెప్పింది.