Begin typing your search above and press return to search.
కండోమ్ పై జీరో...మాపై ఎందుకు జీఎస్టీ
By: Tupaki Desk | 13 July 2017 6:17 AM GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై మహిళాలోకం మండిపడుతోంది. ముఖ్యంగా నెలసరి సమయంలో వాడే శానిటరీ ప్యాడ్స్ పై ఈ పన్ను భారం పడి వాటి ధరలు పెరుగుతుండడంతో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇందుకుగాను ట్విట్టర్ వేదికగా ‘#Don’t tax on my period’ అనే పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. శానిటరీ ప్యాడ్స్ పై జీఎస్టీలో 12 శాతం పన్ను విధిస్తున్నారు. అదే సమయంలో ఈ కొత్త పన్ను విధానంలో కండోములపై ఒక్క పైసా కూడా పన్ను లేదు. జీరో పర్సంట్ టాక్స్ కేటగిరీలో కండోమ్స్ ఉండగా శానిటరీ ప్యాడ్స్ 12 శాతం క్యాటగిరీలో ఉన్నాయి.
మహిళల జీవిత కాలంలో సగటున సుమారు 3 వేల రోజులు రుతుక్రమం ఉంటుంది. అంటే జీవితకాలంలో 6 వేల నుంచి 9 వేల శానిటరీ ప్యాడ్స్ వినియోగిస్తారు. వీటిపై పన్ను పెంచడం వల్ల అదనపు భారం పడడం ఖాయం. మహిళల ఆరోగ్యం - పరిశుభ్రత గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఇలా వీటిపై పన్నేయడం దారుణమని పలువురు గైనకాలజిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా ఆదాయం లేని మహిళలకు ఈ ట్యాక్స్ వల్ల ఇబ్బందిపడడం ఖాయంగా కనిపిస్తోంది. సగటున కనీసం రూ. 100 వరకు దీనికోసం మహిళలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ.. 12 శాతం పన్ను వేయడం వల్ల వీరిపై భారం పెరుగుతుంది. గృహిణులు - విద్యార్థినులు - ఉద్యోగినులు... ఇలా సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలూ దీనిపై మండిపడుతున్నారు. కేంద్రం తన ఆలోచన మార్చుకుని శానిటరీ ప్యాడ్స్ పై పన్ను తొలగించాలని కోరుతున్నారు. దీనికోసం ఉద్యమిస్తున్నారు.