Begin typing your search above and press return to search.

కండోమ్ యాడ్ల‌కేనా..'బూతు' చ‌ర్చ‌లపై నిషేధం లేదా?

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:42 PM GMT
కండోమ్ యాడ్ల‌కేనా..బూతు చ‌ర్చ‌లపై నిషేధం లేదా?
X
ప్ర‌స్తుతం టెలివిజ‌న్ ల‌లో ఉద‌యం ఆరు గంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల మ‌ధ్య కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల‌పై కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ‌ నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ప్రైం టైంలో ఆ యాడ్ లు ప్ర‌సారం చేయ‌డం వ‌ల్ల పిల్ల‌లపై చెడు ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఈ మ‌ధ్య కాలంలో కొన్ని తెలుగు న్యూస్ చానెల్స్ లైవ్ డిబేట్ల‌లో కండోమ్ యాడ్స్ కంటే ఎక్కువ అస‌భ్యత‌ - న‌గ్న‌త్వం గురించి జ‌రుగుతున్న చ‌ర్చల గురించి కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ‌ ఆలోచించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కొన్ని చానెళ్లు త‌మ టీఆర్పీలను పెంచుకోవ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా కొన్ని అన‌వ‌స‌ర చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాకుండా...ఆ చ‌ర్చ‌ల్లో వ‌క్త‌లు మాట్లాడే అస‌భ్య ప‌ద‌జాలం - అభ్యంత‌ర‌క సంభాష‌ణ‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం శోచ‌నీయం. ఈ ధోర‌ణి ఇలాగే కొన‌సాగితే....పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు రావ‌డం త‌థ్య‌మ‌ని ప‌లువురు త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కొద్ది రోజులుగా కొన్ని ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చానెళ్ల‌లో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన జీఎస్టీ(గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) వీడియోపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ చ‌ర్చ‌లు చినికి చినికి గాలి వాన‌గా మారి....ప‌డ‌క గ‌దిలో గుట్టుగా జ‌రిగే విష‌యాల‌ను - గ‌త రాత్రి ఎవ‌రెవ‌రు ఏం ప‌నులు చేశారు....అని లైవ్ లో ముచ్చ‌టించే స్థాయికి దిగ‌జారాయి. వ‌ర్మ వంటి మేధావి....ఎదుటి వక్త‌లు - వ్య‌క్తులు స‌మాధానం చెప్ప‌లేని అభ్యంత‌ర‌క‌ర ప్ర‌శ్న‌లు లైవ్ లోనే అడిగి త‌న మేధ‌స్సును చాటుకోవ‌డం సీరియ‌స్ గా ప‌రిగ‌ణించ‌ద‌గ్గ విష‌యం. సెక్స్ ఎడ్యుకేష‌న్ గురించి పిల్ల‌ల‌కు తెలియ‌జెప్పాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల పై ఉన్న మాట వాస్త‌వ‌మే. కానీ, ఆ విష‌యాల‌ను చెప్ప‌డానికి వ‌ర్మ‌ - క‌త్తి మ‌హేశ్ - పోసాని వంటి లాజిక‌ల్ థింకింగ్ ఉన్నమేధావులు స‌రైన‌వారు కాదేమో అన్న అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కార్టూన్ చానెళ్ల‌లో - సీరియ‌ళ్ల‌లో పాత్ర‌ల‌ను పిల్ల‌లు అనుక‌రించి....అఘాయిత్యాల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌ల గురించి మ‌నం వార్త‌ల్లో వింటూనే ఉన్నాం. అటువంటిది, ఈ త‌ర‌హా చెత్త లైవ్ డిబేట్ల‌లో వారు చెప్పే విష‌యాలు...పిల్ల‌ల‌పై ఏర‌క‌మైన ప్ర‌భావాన్ని చూపుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దాదాపుగా చాలా ఇళ్ల‌ల్లో అందుబాటులో ఉన్న ఒక‌ టీవీలో వ‌చ్చే కార్య‌క్ర‌మాన్ని కుటుంబ‌స‌భ్యులంతా క‌లిసి వీక్షించాల్సిన ప‌రిస్థితులుంటాయి. అందులోనూ వార్తా చానెళ్ల‌లో చ‌ర్చ‌లలో కూడా ఇటువంటి బూతు కంటెంట్, అస‌భ్య ప‌ద‌జాలం వ‌స్తుంద‌ని ప్ర‌తి ఒక్కరూ ఊహించే ప‌రిస్థితి ఉండ‌దు. ఆ బాధ్య‌త క‌చ్చితంగా అటువంటి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేస్తోన్న మీడియా చానెళ్ల‌దే. నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ తో పాటు మ‌రికొన్ని టెలివిజన్ ప్రొవైడర్స్ పిల్లలు - పెద్ద‌ల కోసం ప్ర‌త్యేక‌మైన‌ సెగ్మెంట్ లను ఏర్పాటు చేశాయి. అమెరికా వంటి దేశాల్లో మీడియాపై ఆంక్ష‌లు లేన‌ప్ప‌టికీ...అక్క‌డి వార్తా చానెళ్లు ఇటువంటి డిబేట్ ల‌లో క‌నీస మ‌ర్యాద‌ - స‌భ్య‌త పాటిస్తాయి.

కానీ, టీఆర్పీల కోసం క‌క్కుర్తి ప‌డే కొన్ని తెలుగు న్యూస్ చానెళ్లు అటువంటి అస‌భ్యక‌ర‌మైన‌ - జుగుప్సాక‌ర‌మైన కంటెంట్ ను నిరాటంకంగా ప్రసారం చేయ‌డం నిజంగా శోచ‌నీయం. పాశ్చాత్య పోక‌డ‌ల‌ను ఫాలో అవుతున్న తెలుగు న్యూస్ చానెళ్లు....అస‌భ్య ప‌ద‌జాలం - డిబేట్ ల‌పై ఆ ప‌రిమితులను ఎందుకు పాటించ‌డంలేద‌నేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌. ఒక వేళ లైవ్ డిబేట్ ల‌లో వ‌క్త‌లు సంయ‌మ‌నం కోల్పోయి మాట్లాడితే..... హింస‌ - నగ్నత్వం - అస‌భ్య‌తతో కూడిన ఆడియో లేదా వీడియో ప్ర‌సారం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే.....ఆ ఆడియోను బీప్ చేసి - వీడియోను బ్ల‌ర్ చేయ‌డం స‌ద‌రు మీడియా చానెల్ కు చిటికెలో ప‌ని. విస్తృతంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని స‌ద‌రు మీడియా చానెళ్లు ఉప‌యోగించి....కేవ‌లం ఒకే ఒక మీట నొక్కి ఆ కంటెంట్ ను ప్ర‌సారం కాకుండా ఆప‌వ‌చ్చు....త‌ద్వారా త‌మ కార్య‌క్ర‌మాన్ని నిరాటంకంగా కొన‌సాగించి....టీఆర్పీల‌ను విప‌రీతంగా పెంచేసుకోవ‌చ్చు. భావిభార‌త పౌరుల‌ను దృష్టిలో ఉంచుకొని స‌ద‌రు న్యూస్ చానెళ్లు....ఇక‌పై త‌మ టీఆర్పీల దాహాన్ని త‌గ్గించుకొని.....స‌హేతుక‌మైన‌ - పిల్ల‌ల‌తో క‌లిసి వీక్షించ‌ద‌గ్గ వార్త‌ల‌ను - కార్య‌క్ర‌మాల‌ను - డిబేట్ ల‌ను ప్ర‌సారం చేయాల‌ని ఆశిద్దాం! ఆ దిశ‌గా కేంద్ర స‌మాచార మంత్రిత్వ శాఖ క‌ఠిన‌మైన నిబంధన‌లు - నిషేధాలు విధించాల‌ని కోరుకుందాం!