Begin typing your search above and press return to search.

అక్కడ కూడా కార్డులు గీకేయటమే

By:  Tupaki Desk   |   26 Nov 2016 5:47 AM GMT
అక్కడ కూడా కార్డులు గీకేయటమే
X
పాత నోట్ల రద్దు నేపథ్యంలో చిల్లర సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిల్లర తిప్పలు తప్పించటానికి వీలుగా కేంద్రం ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. దీంతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలలో డిసెంబరు 2 వరకు పాత నోట్లను చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో.. యుద్ధ ప్రాతిపదికన టోల్ గేట్ల దగ్గర స్వైపింగ్ యంత్రాల్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులువేస్తోంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్యల్ని చేపట్టింది. పాతనోట్లతో పాటు చిల్లర సమస్యలకు చెక్ చెప్పటంతో పాటు.. టోల్ ప్లాజా వసూళ్లను మరింత పారదర్శకంగా ఉండేందుకు ఈ స్వైపింగ్ యంత్రాలు పనికి వస్తాయని భావిస్తున్నారు. అన్ని డెబిట్.. క్రెడిట్ కార్డులు చెల్లుబాటు అయ్యేలా ఏపీలో చేపట్టిన కార్యక్రమం సక్సెస్ కావటంతో.. ఇదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.

ఏపీ రవాణా శాఖ అన్ని చెక్ పోస్టులలోనూ.. టోల్ గేట్ల వద్దా స్వైపింగ్ మెషీన్లను ఏర్పాటు చేసింది. కార్డు ఏదైనా గీసేలా ఏర్పాట్లు చేయటంతో పాటు.. వాహనం వద్దకే నేరుగా వెళ్లి గీకేసే పద్ధతికి వెసులుబాటు ఉండటం ఇప్పుడు కలిసి వస్తుందని చెబుతున్నారు. రద్దీగా ఉండే సమయాల్లో మరింత వేగంగా వాహనాల్ని క్లియర్ చేసేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఏపీలో విజయవంతంగా నిర్వహిస్తున్న స్వైపింగ్ మెషీన్లను దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. డిసెంబరు24 నాటికి స్వైపింగ్ మెషీన్ల ఏర్పాటును పూర్తి చేయాలని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో టోల్ ప్లాజా దగ్గరా.. కార్డుల్ని గీకేసుకొని వెళ్లిపోయే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.