Begin typing your search above and press return to search.

సీఎంఓ లోనూ వికేంద్రీకరణ.. ప్రక్షాళనకు జగన్ మొగ్గు

By:  Tupaki Desk   |   6 March 2020 5:59 AM GMT
సీఎంఓ లోనూ వికేంద్రీకరణ.. ప్రక్షాళనకు జగన్ మొగ్గు
X
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన మూడు ప్రాంతాల నుంచి జరగనుంది. మూడు రాజధానులు అమల్లోకి వస్తే త్వరలోనే దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అందుకనుగుణంగా పని చేయాలి. రాజధాని విభజన ప్రక్రియ త్వరలోనే అమలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికార వికేంద్రీకరణకు అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. మరో నెల రోజుల్లో మూడు ప్రాంతాల్లో పాలన సాగేలా ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కార్యాలయం కూడా విభజించే అవకాశం ఉంది. అందులో భాగంగా పూర్తిగా సీఎంఓను ప్రక్షాళన చేసేట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. రాజధానుల తరలింపు విషయంలో వెంటనే స్పందించే అధికారుల కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల పలు కార్యక్రమాల నిర్వహణలో కూడా సీఎంఓ విఫలమవడంతో ప్రక్షాళనకు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఒక కార్యాలయం ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యక్రమాలు, ప్రభుత్వ నియమనిబంధనలు, అన్ని అంశాలపై సహకరించేందుకు ఆ కార్యాలయం పని చేస్తుంటుంది. దీంతోపాటు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు, విధివిధానాలు ప్రజలకు తెలపడం, శాఖలతో సమన్వయం చేయడం తదితర పనులు సీఎంఓ చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఇష్టాను ప్రకారం ఆ సీఎంఓ రూపుదిద్దుకుంటుంది. తమకు నచ్చిన వారు, తమకు గురువులుగా ఉన్నవారిని సీఎంఓలో సీఎం చోటు కల్పిస్తారు. ఆ మేరకు సీఎంఓ సిద్ధమవుతోంది. ఈ మేరకు జగన్ కూడా తన కార్యాలయం రూపుదిద్దుకుంటున్నారు. అయితే ఈ టీమ్ ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని తెలుస్తోంది. తన ఆలోచనలకు అనుగుణం గా పని చేసే టీమ్ కోసం జగన్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే తనకు విధేయులు, తనకు అండదండగా నిలబడిన వారిని సీఎంఓలోకి తీసుకోగా.. అప్పటికే ఉన్న మరికొందరు కొనసాగుతున్నారు.

అయితే తన టీమ్ ను సిద్ధం చేసుకోవడం లో జగన్ పూర్తిగా విజయవంతం కాలేదు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో పాటు మరికొందరు అధికారులను ఈ క్రమంలోనే బదిలీ చేశారు. తన ఆలోచనలు ఏకీభవించే వారికి, తన నిర్ణయాలను వెంటనే అందుకుని వాటిని వేగవంతం చేసేందుకు ఉన్న వ్యక్తులను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానులు ఏర్పడుతుండడం తో తరచూ ప్రయాణాలు చేసే వారు, శాఖలతో సమన్వయం చేసుకోవడం తదితర వ్యవహారాల్లో చురుగ్గా ఉండేవారి కోసం చూస్తున్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ప్రచారం, ప్రయోజనం ఉండడం లేదని జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రశంసల కన్నా విమర్శలు అధికమవుతున్నాయి. దీన్ని తిప్పకొట్టడంలో సీఎంఓ విఫలమవుతుందనే విషయాన్ని గుర్తించిన జగన్ ఈ మేరకు సీఎంఓ ప్రక్షాళన చేసి త్వరలోనే కొత్త రూపు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. కొత్త టీమ్ ను సిద్ధం చేసుకుని కార్య నిర్వాహక రాజధానిగా ఉన్న విశాఖపట్టణానికి వెళ్లాలనే భావనలో జగన్ ఉన్నట్లు అధికార వర్గాల్లో వినిపిస్తున్న మాట.