Begin typing your search above and press return to search.

ట్రంప్ అభిశంసనకు ముహుర్తం డిసైడ్ చేశారా?

By:  Tupaki Desk   |   10 Jan 2021 11:00 AM GMT
ట్రంప్ అభిశంసనకు ముహుర్తం డిసైడ్ చేశారా?
X
ఈ నెల 20న అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. అంటే.. మరో పది రోజులు. ఇవాల్టి రోజు.. ఆ రోజు తీసేస్తే.. మహా అయితే ఎనిమిది రోజులు మాత్రమే మిగిలి ఉంది.కానీ..ఆ వారం కూడా ట్రంప్ దేశాధ్యక్షుడి కుర్చీలో కూర్చోవటానికి వీల్లేదని తేల్చేస్తున్నారు డెమొక్రాట్లు. అంతేకాదు.. ట్రంప్ కు భారీ వార్నింగ్ ఇచ్చేశారు. నీకు నువ్వుగా పదవి నుంచి తప్పుకో. లేదంటే.. అభిశంసిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు బలం లేని డెమొక్రాట్లు అంత దమ్ముగా చెబుతున్నారంటే దానికి కారణం రిపబ్లికన్లే.

క్యాపిటల్ భవనంపై దాడితో శ్వేత జాత్యాహంకార గ్రూపులు యాక్టివ్ కావటమే కాదు.. మరిన్ని దాడులకు ఎత్తులు వేస్తున్నట్లుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో.. అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఉదంతంలో నిఘా వర్గాల వైఫల్యంతో పాటు.. భద్రతా వర్గాల డొల్లతనం బయటకొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అదే సమయంలో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. క్యాపిటల్ హిల్ ముట్టడికి ప్రోత్సహించిన నేరానికి ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నగట్టి పట్టుదలతో డెమొక్రాట్లు ఉన్నారు. మాటలకు పరిమితం కాకుండా.. శనివారం మొత్తం ట్రంప్ ను అభిశంసించేందుకు అవసరమైన ప్రక్రియ పైనే వారు పని చేయటం గమనార్హం. తమ హెచ్చరికను పరిగణలోకి తీసుకోకుంటే సోమవారం అభిశంసించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే.. దీనికి బైడెన్ వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ట్రంప్ తనకు తానుగా వైదొలగాలని.. లేదంటే రెండోసారి అభిశంసించటానికి తాము వెనుకాడమని.. ఇది తమ నిర్ణయమని.. గద్దె దిగాలని ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా పేర్కొన్నట్లు స్పీకర్ నాన్సీ పెలోసీ చెప్పారు. తిరుగుబాటును దగ్గర ఉండి నడిపించిన ట్రంప్ పదవిలో కొనసాగటానికి అనర్హులని తీర్మానం ముసాయిదాలో పేర్కొన్నారు.

ఒకవేళ అభిశంసన ప్రక్రియ మొదలైతే.. బుధ.. గురువారాల్లో చర్చ జరుగుతుంది. తీర్మానం ఆమోదించిన తర్వాత సెనెట్ కు వెళుతుంది. అయితే.. సెనెట్ దీన్ని చేపట్టి నిష్పక్షపాతమైన విచారణ జరిపే వేళకు ట్రంప్ పదవీ కాలం పూర్తి కానుంది. అయినా.. దాన్ని కొనసాగించి.. ఆయన్ను ఎలాగైనాఅభిశంసించాలన్నది డెమొక్రాట్ల ఆలోచన. అయితే.. ఈ ప్రక్రియను 20న ప్రమాణస్వీకారం చేసిన బైడెన్ ఆమోదిస్తారా? అన్నది ప్రశ్న.

దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్ కారణంగా అమెరికాలో రెండు వర్గాల మధ్య దూరం బాగా పెరిగిపోయిన వేళ.. తాను అధికారంలోకి వచ్చినంతనే దేశం మొత్తాన్ని ఒక్కతాటి మీదకు తీసుకొస్తానని బైడెన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇన్ని మాటలు చెప్పి.. ఇప్పుడు ఒక్కసారిగా పదవీ కాలం చివరి కాలంలో ఉన్న ట్రంప్ ను అభిశంసించటం ద్వారా రిపబ్లికన్లతో వైరాన్ని బైడెన్ కోరుకోవటం లేదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.