Begin typing your search above and press return to search.

తిరుగుబాటు ఎంఎల్ఏలపై అనర్హత వేటు ?

By:  Tupaki Desk   |   24 Jun 2022 5:28 AM GMT
తిరుగుబాటు ఎంఎల్ఏలపై అనర్హత వేటు ?
X
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గంటకో మలుపు, పూటకో మలుపు అన్నట్లుగా సాగుతోంది. అధికార మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి ప్రభుత్వంలోని శివసేన ఎంఎల్ఏల్లో తిరుగుబాటు చేసిన ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని డిసైడ్ చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి ఉథ్థవ్ థాక్రే, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తో పాటు కొందరు పార్టీ కీలక నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ సమయంలోనే తిరుగుబాటు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాల్సిందే అని డిసైడ్ అయ్యారట.

తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో కొందరు ఎంఎల్ఏలు ఎంవీఏ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవదీసిన విషయం తెలిసిందే. వీళ్ళ తిరుగుబాటు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి థాక్రే పైనే అయినప్పటికి అంతిమంగా కూలిపోయేది ఎంవీఏ ప్రభుత్వమే అన్న విషయం అందరికీ తెలిసిందే. శివసేనలోని ఎంఎల్ఏలతో థాక్రే గురువారం అత్యవసర సమావేశం పెడితే హాజరైంది కేవలం 13 మంది మాత్రమే. దాంతోనే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్ధమైపోతోంది.

ఇదే సమయంలో షిండే నేతృత్వంలో 44 మంది ఎంఎల్ఏలున్నట్లు సమాచారం. అయితే ఈ సంఖ్యను ఎవరు నిర్ధారించటం లేదు. అందుకనే తిరుగుబాటు ఎంఎల్ఏల్లో ముందు 17 మందిపై అనర్హతవేటు వేయబోతున్నారు. సీఎం పిటీషన్ ఇవ్వగానే స్పీకర్ సదరు ఎంఎల్ఏలకు నోటీసులు జారీ చేస్తారు. వారి స్పందన బట్టి వెంటనే కానీ లేదా ఒక సమావేశం తర్వాత కానీ వారిపై అనర్హత వేటు పడే అవకాశముంది.

నిజంగానే 17 మందిపై అనర్హత వేటు పడితే అప్పుడు రాజకీయాలు మరింత రసకందాయంలో పడతాయి. ఎందుకంటే 288 మంది ఎంఎల్ఏలున్న అసెంబ్లీ బలనిరూపణ అవసరమైనపుడు ఎంఎల్ఏల సంఖ్య కూడా తగ్గిపోతుంది.

అప్పుడు శివసేన ఎంఎల్ఏ సంఖ్య తగ్గిపోయినా మిత్రపక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ బలంతో ప్రభుత్వం నడిచిపోతుంది. కాకపోతే ప్రభుత్వం ఏర్పాటైనపుడు కూటమిలో శివసేన ఎంఎల్ఏల బలం ఎక్కువ కాబట్టి థాక్రే సీఎం అయ్యారు. రేపు బలం తగ్గిపోయిన తర్వాత కూడా థాక్రేనే సీఎంగా మిత్రపక్షాలు అంగీకరిస్తాయా అన్నది చూడాలి.