Begin typing your search above and press return to search.

ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్ర‌క‌టించండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ సైటెర్లు!

By:  Tupaki Desk   |   11 Oct 2022 5:29 AM GMT
ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రాగా ప్ర‌క‌టించండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ సైటెర్లు!
X
ఏపీలో మూడు రాజ‌ధానుల అంశం కాక రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక్క అధికార వైసీపీ మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు ఒకే ఒక్క రాజ‌ధాని అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజ‌ధానుల జపం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమ‌రావ‌తి రాజ‌ధాని రైతులు.. అమ‌రావతిని ఏకైక రాజ‌ధానికి కొన‌సాగించాల‌ని కోరుతూ అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పేరుతో పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర ప్ర‌స్తుతం కోన‌సీమ జిల్లాలోకి ప్ర‌వేశించ‌బోతోంది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం జోరు పెంచింది. ఆ పార్టీ నేత‌లు, మంత్రులు రాజ‌ధాని రైతుల పాద‌యాత్ర‌పై మండిప‌డుతున్నారు. రైతుల పాద‌యాత్ర‌ను అడ్డుకుంటామ‌ని.. దాడులు కూడా చేస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. ఏం జ‌రిగినా అది చంద్ర‌బాబుదే బాధ్య‌త అవుతుంద‌ని తీవ్ర హెచ్చ‌రిక‌లు ఇప్ప‌టికే జారీ చేశారు.

అంతేకాకుండా అక్టోబ‌ర్ 15న విశాఖ గ‌ర్జన‌కు వైసీపీ పిలుపునిచ్చింది. ఉత్తరాంధ్ర జేఏసీ పేరుతో దీన్ని నిర్వ‌హిస్తున్నా దీని వెనుక క‌ర్మ‌, క‌ర్త‌, క్రియ వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని రాజ‌ధాని రైతులు విమ‌ర్శ‌సిస్తున్నారు. త‌మ యాత్ర కొద్ది రోజుల్లో ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌వేశించ‌బోతున్న నేప‌థ్యంలో త‌మ‌పై దాడి చేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. ఇప్ప‌టిదాకా లేని సంఘాల‌ను, జేఏసీల‌ను ఏర్పాటు చేసింద‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోమారు సోష‌ల్ మీడియా సాక్షిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దేనికి గ‌ర్జ‌న‌లు అంటూ 25 ప్ర‌శ్న‌లు సంధించి వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టిన ప‌వ‌న్ మ‌రోమారు రాజ‌ధానుల అంశంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సెటైర్లు సంధించారు.

వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే, ఏపీని మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? ఏది ఏమైనప్పటికీ వైసీపీ నేత‌లు చట్టం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు, ప్రవర్తిస్తారు. మిగిలిన పౌరులు ఏమనుకుంటున్నారో అనేది వైసీపీ నేత‌లు అస‌లు ప‌ట్టించుకోరు... అంటూ ప‌వ‌న్ సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు.

… అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర"గా ప్రకటించండి. 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించండి. 25 రాజధానుల‌ను ఏర్పాటు చేయండి. 'ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండిస‌.. ఈ విష‌యంలో దయచేసి సంకోచించకండి.. అంటూ ఘాటుగా స్పందించారు.. జ‌న‌సేనాని.

దీంతో మ‌రోమారు వైసీపీ నేత‌లు ప‌వ‌న్ పై విరుచుకుప‌డ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. దేనికి గ‌ర్జ‌న‌లు అంటూ అక్టోబ‌ర్ 10న ప‌వ‌న్ క‌ల్యాణ్ సంధించిన 25 ప్ర‌శ్న‌ల‌పై వైసీపీ నేత‌లు, మంత్రులు ఆయ‌నపై నిప్పులు క‌క్కిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఏపీని 25 రాష్ట్రాలు చేసి 25 రాజధానుల‌ను ప్ర‌క‌టించండి అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన తాజా ట్వీట్ తో వైసీపీ నేత‌లు భ‌గ్గుమ‌న‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.