Begin typing your search above and press return to search.

తగ్గుముఖం పట్టిన జనాభా.. డ్రాగన్ కంట్రీ సంచలన నిర్ణయం!

By:  Tupaki Desk   |   31 May 2021 2:30 PM GMT
తగ్గుముఖం పట్టిన జనాభా.. డ్రాగన్ కంట్రీ సంచలన నిర్ణయం!
X
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లుగా ఆ దేశ జనాభా తగ్గుతోంది. జనన మరణాల రేటులో అధిక వ్యత్సాసం ఉంది. అంతేకాకుండా కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఇతర అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ సర్కార్ ముందు చూపుతో వ్యవహరించింది.

చైనాలో ఇద్దరు సంతానం వరకే అనుమతి ఉంది. ఆ దేశంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఎవరైనా ముగ్గురికి జన్మనిస్తే వారికి ఏకంగా 1,30,000 యువాన్ ల జరిమానా విధించింది. ఈ నియమాన్ని చాలా కఠినంగా అమలు చేస్తూ వస్తోంది. అయితే తాజా నిర్ణయంతో ఈ నిబంధనను ఎత్తి వేయనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరే సంతానం ఉండాలన్న ఆంక్షలను సడలించింది. ఆ సంఖ్యను ముగ్గురికి పెంచింది. ఇక నుంచి ముగ్గురు పిల్లలను కలిగి ఉండడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తాజాగా చైనా అధినేత జిన్ పింగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు గ్ఝిన్ హువా అనే న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక నుంచి ముగ్గురు సంతానం ఉండొచ్చనే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పిల్లల పాలసీల్లోనూ పలు మార్పులు చేయనున్నట్లు తెలిపింది. చైనా ముందు చూపుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని హర్షం వ్యక్తం చేసింది.

కొద్దికాలంగా చైనాలో వృద్ధుల రేటు అమితంగా పెరుగుతోంది. యువకుల రేటు దిగజారి వృద్ధుల రేటు అమాంతం ఎగబాకుతోంది. ఇలాగే కొనసాగితే వృద్ధ దేశానికి చిరునామాగా చైనా మారుతుందని భావించిందని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూస్ ఏజెన్సీ అభిప్రాయపడింది. అంతేకాకుండా ఏ దేశ అభివృద్ధికైనా మానవ వనరులు అవసరమని నొక్కి చెప్పింది. అందులోనూ యువత ఎక్కువగా ఉండాలని సూచించింది. చైనా ఈ కొత్త పాలసీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని వెల్లడించింది.