Begin typing your search above and press return to search.

తగ్గిన వానలు.. వెంటాడుతున్న వరదల భయం

By:  Tupaki Desk   |   14 July 2022 11:30 AM GMT
తగ్గిన వానలు.. వెంటాడుతున్న వరదల భయం
X
తెలంగాణలో వానలు తగ్గినా.. వరదల భయం వెంటాడుతోంది. ఉత్తర తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే వరదలు మాత్రం ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్ర లాంటి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు చేరుతుండడంతో ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. నిన్న కడెం ప్రాజెక్ట్ పై నుంచి నీరు పొంగి పొర్లడంతో ఆ ప్రాజెక్ట్ కింద అధికారులు, ప్రజలు ఆందోళన చెందారు. సామర్థ్యానికి మించి వరద ప్రవాహం రావడంతో గేట్లు అన్నీ ఎత్తేశారు. అయినా వరదల ప్రాజెక్ట్ పైనుంచి బయటకు వచ్చేసింది. ఇదే క్రమంలోనే లెప్ట్ కెనాల్, పవర్ హౌస్, హరిత రిసార్ట్ సమీపంలో మూడు చోట్ల కట్టకు గండిపడింది. ప్రాజెక్ట్ తెగిపోతుందన్న భయాలు వెంటాడాయి.

అయితే వరద తగ్గుముఖం పట్టడంతో నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యవేక్షించారు. కడెం ప్రాజెక్ట్ సేఫ్ గానే ఉందన ప్రకటించారు. ప్రాజెక్ట్ కింద ముంపునకు గురైన 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో తగ్గింది. అయినా 17 గేట్ల ద్వారా లక్ష 83వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.

ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్ కు ముప్పు తప్పినట్టేనని భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా నుంచి మంచిర్యాల వెళ్లే రహదారి పలు చోట్ల దెబ్బతింది. కడెం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మొత్తం 54 గేట్లు ఎత్తివేసి 12 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వదలుతున్నారు. దీని ప్రభావంతో మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.

ఎల్లంపల్లికి భారీ గా వరద నీరు రావడంతో గోదావరిఖని బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో గోదావరిఖని-మంచిర్యాల మధ్యరాకపోకలు ఆగిపోయాయి. కరీంనగర్ సమీప నగునూరు వాగులో 9 మంది కూలీలు చిక్కుకుపోవడంతో కరీంనగర్ మంత్రి గంగుల రెస్క్యూ ఆపరేషన్ కు ఆదేశించారు.

గోదావరి ఖని సింగరేణి ఇంటెక్ వెల్ లో ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో వరద ప్రాంతాల్లో హరీష్ రావు పర్యటించారు. వరంగల్ లో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించి సహాయ చర్యలు చేపట్టారు.

ఇక ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులు అన్నీ దాదాపు నిండిపోయాయి. నిన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును మంత్రి ప్రశాంత్ రెడ్డి సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారీకి గోదావరి, ప్రాణహిత నుంచి భారీ ప్రవాహం కొనసాగుతోంది. ఇక తెలంగాణలో భారీ వర్సాల కారణంగా మరో మూడు రోజులు ఆదివారం వరకూ పాఠశాలలకు సెలవులను పొడగించారు.