Begin typing your search above and press return to search.

‘అమ్మ’ మేనకోడలు దీప కథేంది?

By:  Tupaki Desk   |   8 Oct 2016 5:13 AM GMT
‘అమ్మ’ మేనకోడలు దీప కథేంది?
X
అందరి నోట అమ్మగా పిలుచుకునే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత వివరాలు పెద్దగా బయటకు రావు. ఆమెకు అత్యంత సన్నిహితంగా కనిపించే శశికళ తప్పించి వేరెవరూ కనిపించరు. పెంపుడు కుమారుడు ఉన్నప్పటికీ.. అతనితో సంబంధాలు అంతంత మాత్రమే. అంతకు మించి ఆమెకు దగ్గరగా ఉన్నోళ్లు ఎవరూ కనిపించరు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఇప్పుడు చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో మాటకు సైతం చెప్పలేని అనారోగ్య పరిస్థితుల్లో ఆమె ఇప్పుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వేళ.. అమ్మ మేనకోడలుగా ‘దీప’ అనే క్యారెక్టర్ బయటకు వచ్చింది.

తమిళనాడులో ఆమె కాస్త పరిచయం ఉన్నా.. తెలుగు ప్రజలకు ఆమె కొత్తనే చెప్పాలి. తన అత్త (జయలలిత సొంత సోదరుడి కుమార్తె) జయలలిత తీవ్ర అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో ఆమెను కలుసుకునే అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నిస్తున్న ఆమెకు.. అధికారులు ససేమిరా అంటున్నారు. నా ఇంటి మనుషుల వద్దకు వెళ్లేందుకు అడ్డు చెప్పటానికి మీరెవరు? అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోనట్లుగా ఉంటున్నారు. అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి చేస్తూ.. ఫైర్ అవుతున్న దీప మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు.

ఇంతకీ ఈ దీప ఎవరు? అమ్మ మేనకోడలుగా చెప్పే ఆమెతో జయలలిత ఎలా వ్యవహరించే వారు? జయతో దీపకు ఉన్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంతకీ ఆమె సీన్లోకి ఎందుకు వచ్చినట్లు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. ఆమె గురించి కాస్త డీటైల్డ్ గా తెలుసుకోవాల్సిందే. జయలలితకు సొంత సోదరుడు జయకుమార్. పెళ్లి తర్వాత కూడా జయ నివాసమైన పోయిస్ గార్డెన్ లోనే ఉండేవారు. దీప పుట్టిన తర్వాత అన్నా చెల్లెళ్ల (జయకుమార్.. జయలలిత) మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో.. ఆయన పోయిస్ గార్డెన్ వదిలేసి.. టీ నగర్ లో వేరుగా ఉండిపోయారు. ఆ తర్వాత అంటే.. 1995 ప్రాంతంలో వేరుగా ఉండటం మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే.. 1995లో చనిపోయారు. ఈ సందర్భంలో జయలలిత ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వచ్చేశారు. మూడేళ్ల కిందట అన్న భార్య (వదిన) కూడా చనిపోయారు. అయితే.. ఈసారి మాత్రం ఆమె వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదు. ఈ మధ్యనే జయ మేనకోడలు దీప పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఆమె పెళ్లికి అమ్మ వెళ్ల లేదు. చివరికికొత్త దంపతులే పోయిస్ గార్డెన్ కు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకొచ్చారు. ఈ సందర్భానికి గుర్తుగా.. మేనకోడలికి ఒక ప్లాట్ ఇచ్చినట్లుగా చెబుతారు.

ఇదిలా ఉంటే.. భర్తతో పొసగని దీప.. పెళ్లి అయిన కొన్నాళ్లకే భర్తకు దూరంగా ఉన్నట్లు చెబుతుంటారు. ఇటీవల కాలంలో మేనత్తకు దగ్గర కావాలని దీప ప్రయత్నించినా.. ఆమె ప్రయత్నాలు ఫలించలేదని చెబుతారు. ఈ మధ్య కాలంలో జయలలిత ఇంటి వద్ద వెయిట్ చేసినా.. మేనత్త దర్శనం ఆమెకు కాలేదు. ఇదిలా ఉంటే.. జయ నివాసమైన పోయిస్ గార్డెన్ లోని ఇల్లు తమ నానమ్మ(జయలలిత తల్లి)దని.. ఆ ఇంటిని తనకు రాసిచ్చినట్లుగా దీప చెబుతుంటారు. దీనికి సంబంధించిన దస్తావేజుల్ని చూపిస్తుంటారు.

ఇక.. దీప గతంలోకి వెళితే.. ఆమె లండన్ లో చదువుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే వారు. అయితే.. మేనత్తకు దగ్గర కావాలని.. ఆమె రాజకీయ వారసురాలిగా ఎదగాలన్నది ఆమె కోరికగా పలువురు చెబుతుంటారు. ఇందులో భాగంగా మేనత్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటే.. అమ్మ చుట్టూ ఉండేవారు తనను కలవనీయటం లేదని.. దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తుంటారు. అయితే.. వారసత్వం కోసం దీప తొందరపాటు.. తహతహ బయటపడేలా వ్యవహరించటం ఆమె అవకాశాల్ని దెబ్బ తీసినట్లుగా చెబుతుంటారు. వారసత్వం కోసం ఓపిగ్గా ఎదురుచూడాల్సింది పోయి.. ఏమీ లేకుండానే.. ఆమె తన మనసులోని కోరిక బయటపడేలా చేయటం ఆమెకున్న అవకాశాల్నిదెబ్బ తీసినట్లుగా చెబుతుంటారు. చివరకు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేనత్త వద్దకు వెళ్లే అవకాశాన్ని కూడా ఆమె చేజిక్కించుకోలేని పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/