Begin typing your search above and press return to search.

భార్య మాటలు సరైనవని చెప్పి ఇరుక్కున్న మంత్రి

By:  Tupaki Desk   |   7 April 2015 7:37 AM GMT
భార్య మాటలు సరైనవని చెప్పి ఇరుక్కున్న మంత్రి
X
మంచి చెప్పినా.. దానిలో పలు కోణాలు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రిటీలు.. ప్రముఖ రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మంచి కోసం చెప్పే క్రమంలో ఒకట్రెండు మాటలు తేడా వస్తే.. అసలు పోయి కొసరు మిగిలే పరిస్థితి. ప్రస్తుతం గోవా మంత్రి సతీమణి ఇలాంటి వ్యాఖ్యలే చేసి వివాదస్పదంగా మారారు.

పిల్లల్ని కాన్వెంట్‌ స్కూళ్లకు పంపుతూ వెస్ట్రన్‌ కల్చర్‌కు అలవాటు పడటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ గోవా మంత్రి దీపక్‌ ధవిలికర్‌ సతీమణి లలిత వ్యాఖ్యలు చేయటం తెలిసింది. వంటి తీరును కనిపించేలా బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించటం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయని.. ముఖానికి సిందూరం పెట్టటం మానేశారని.. జుట్టును కత్తిరిస్తున్నారంటూ ఆమె చాలానే చెప్పారు. అవికాస్తా వివాదాస్పద వ్యాఖ్యలు అయ్యాయి.

ఈ వ్యాఖ్యల్ని సదరు మంత్రిగారి దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన తన భార్య చెప్పిన మాటల్ని సమర్థించటం మరింత వివాదాస్పదమైంది. ప్రజల్లో మార్పు చూస్తున్నామని.. వారి పద్ధతుల నుంచి ధరించే వస్త్రాల వరకూ చాలానే మార్పులు వచ్చాయని.. ఈ క్రమంలోనే రేప్‌లు జరుగుతున్నాయని భార్యకు సపోర్ట్‌ చేశారు.

సనాతన్‌ సంస్థలో పని చేస్తున్న ఆమె.. అత్యాచారాలు పెరగటానికి ప్రాశ్చాత్య సంస్కృతే కారణమని.. వాటికి దూరంగా ఉండాలని ఆమె మహిళలకు సూచన చేశారు. దీనిపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య మాటల్లో తప్పేం లేదంటూ మంత్రిగారు వ్యాఖ్యానించటంతో వివాదంలో ఆయన కూడా అడుగు పెట్టినట్లు అయ్యింది.