Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర లేడీ సింగం ఆత్మహత్య.. సూసైడ్ లెటర్లో షాకింగ్ నిజాలు

By:  Tupaki Desk   |   27 March 2021 4:45 AM GMT
మహారాష్ట్ర లేడీ సింగం ఆత్మహత్య.. సూసైడ్ లెటర్లో షాకింగ్ నిజాలు
X
'సింగం’ అన్నంతనే ధైర్యసాహసోపేతాలు ప్రదర్శించే పోలీసు మాత్రమే గుర్తుకు వస్తారు. కానీ.. లేడీ సింగం లాంటి క్యారెక్టర్లను సినిమాల్లో మాత్రమే చూస్తాం. అందుకు భిన్నంగా రియల్ గా ఒక అధికారిణి దీపాలీ చవాన్. 28 ఏళ్లున్న ఆమె మహారాష్ట్ర అటవీ శాఖలో పని చేస్తున్నారు. భారత అటవీ సర్వీస్ అధికారి తనను తీవ్రంగా వేధించటం.. దానిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోవటంతో తలడిల్లి తాజాగా సూసైడ్ చేసుకున్నారు.

లేడీ సింగంగా పేరునన 28ఏళ్ల మహిళా అటవీ అధికారిణి ఆత్మహత్య పెను దుమారాన్ని రేపుతోంది. మెల్గాట్ టైగర్ రిజర్వు సమీపంలోని హరిపాల్ గ్రామంలోని తన అధికారిక నివాసంలో గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమె సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఆమె భర్త రాజేశ్ చిఖల్ ధారలో ట్రెజరీ అధికారి. దీపాలి తల్లి తన సొంతూరుకు వెళ్లినసమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరిస్తూ.. అక్రమార్కుల వెన్నులో చలి పుట్టించే ఆమె తన పై అధికారి లైంగిక వేధింపుల్ని మాత్రం తట్టుకోలేకపోయారు. తనను ఎంతలా వేదనకు గురి చేసిందన్న విషయాల్ని నాలుగు పేజీల లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడీ ఉదంతం ప్రకంపనలు రేపుతోంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ లో తనన లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా పేర్కొన్న ఐఎఫ్ఎస్ అధికారి.. అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ ను పోలీసులు నాగపూర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేశారు.

తనను శారీరకంగా.. మానసికంగా ఎంతలా వేధింపులకు గురి చేసిన విషయాన్ని ఆమె తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. శివకుమార్ ఆగడాలపై పలుమార్లు ఆయన సీనియర్ శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఫిబ్రవరి మొదట్లో తాను గర్భవతిగా ఉన్నప్పటికీ మూడు రోజుల పాటు పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందంటూ శివకుమార్ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లారని ఆమె సన్నిహితురాలు చెబుతున్నారు.

గర్భిణి అన్న విషయం తెలిసి కూడా కిలోమీటర్లు దూరం నడిపించారని.. గర్భస్రావం కావటంతో దీపాలీ తీవ్రమైన మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు. ఈ లేఖలోని ఆరోపణలపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. అన్ని కోణాల్లో కేసు విచారణ జరుగుతుందని.. నిందితుల్ని వదలబోమన్నారు. నిందితుడు శివకుమార్ ను సస్పెండ్ చేస్తూ అటవీ శాఖ ముఖ్య కన్జర్వేటర్ అరవింద్ ఆప్టే ఉత్తర్వులు జారీ చేయగా.. ఫిర్యాదు చేసినా స్పందించని ఉన్నతాధికారి శ్రీనివాస్ రెడ్డిపై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.