Begin typing your search above and press return to search.

నోట్ల రద్దుతో జీహెచ్ ఎంసీకి పండగొచ్చింది

By:  Tupaki Desk   |   11 Nov 2016 7:26 AM GMT
నోట్ల రద్దుతో జీహెచ్ ఎంసీకి పండగొచ్చింది
X
మనసుంటే మార్గం ఉంటుందంటారు.. తెలివితేటలు ఉండాలే కానీ ప్రతి అంశాన్నీ మనకు అనుకూలంగా మలచుకోవచ్చని నిరూపించింది జీహెచ్ ఎంసీ. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశమంతా అల్లకల్లోలం రేగింది. చివరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ నిర్ణయంపై బయటకు మంచిదే అన్నా తమ రాష్ట్ర ఆదాయం తగ్గుతుందంటూ ఆందోళన చెందినట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపారాలను దారుణంగా దెబ్బతీసిన ఈ నిర్ణయం మాత్రం జీహెచ్ ఎంసీకి రెండు గంటల్లో 5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిపెట్టింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

నల్లధనాన్ని - నకిలీ నోట్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 500 - 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఆ నోట్ల‌తో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)కి ప‌న్నులు క‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోయింది. జీహెచ్ ఎంసీ స‌హా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రజ‌లు క‌ట్టాల్సిన ప‌న్నులను రద్దయిన పాత నోట్లతో కట్టేయొచ్చని ప్రకటించడంతో పాత‌ నోట్లను తీసుకొని ప‌న్నుల బ‌కాయిల‌ను చెల్లించ‌డానికి ప్రజ‌లు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో జీహెచ్ ఎంసీకి కేవ‌లం రెండు గంటల్లోనే ఐదు కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి.

ప్రస్తుతం చలామ‌ణిలో లేని నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకోవాలంటే బ్యాంకు అధికారులు గుర్తింపు కార్డులు చూపించాల‌ని అడుగుతున్నారు. త‌మ వ‌ద్ద అధిక‌ మొత్తంలో ఉన్న డ‌బ్బు ప‌న్నులు క‌ట్టడానికైనా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని అనుకుంటున్న ప్రజ‌లు బ‌కాయిప‌డ్డ మొత్తం ఒకేసారి చెల్లించేస్తున్నారు. సాయంత్రానికి మరిన్ని కోట్ల ఆదాయం రాబోతోంది.

మరోవైపు జీహెచ్ ఎంసీ ఇంకో ఆఫర్ కూడా ప్రకటించింది. వచ్చే ఐదేళ్ల ఆస్తిపన్ను పాతనోట్లతో చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి తెలిపారు. అయిదేళ్లకు అడ్వాన్సు ట్యాక్సు కూడా తీసుకోనుండడంతో పాత నోట్లను లెక్క చూపకుండా వదిలించుకునేందుకు జనం జీహెచ్ ఎంసీ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో జీహెచ్ ఎంసీ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/