Begin typing your search above and press return to search.

సుఖోయ్ లో చ‌క్క‌ర్లు కొట్టిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి!

By:  Tupaki Desk   |   17 Jan 2018 5:58 PM GMT
సుఖోయ్ లో చ‌క్క‌ర్లు కొట్టిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి!
X
భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్ త‌న‌దైన‌ శైలిలో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. క‌త్తిమీద సామువంటి ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌ల‌త‌ను స్వీక‌రించినప్పటి నుంచి త్రివిధ ద‌ళాల అధికారులు - సిబ్బందిని ప్ర‌త్యక్షంగా క‌లిసి వారి విధులు - కార్య‌కలాపాల గురించి నిశితంగా వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. మంత్రి హోదాలో కేవ‌లం ప‌రేడ్ ల‌కు ప‌రిమితం కాకుండా గ్రౌండ్ లెవ‌ల్ లో నేరుగా ప‌ర్య‌టించి త్రివిధ ద‌ళ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సాక్ష్యాత్తూ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఈ విధంగా చేయ‌డంపై అధికారులు - విశ్లేష‌కులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఇండియ‌న్ నేవీ శక్తిసామర్థ్యాలను ఆమె స్వ‌యంగా సమీక్షించిన సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ నేవీ షిప్ ఐఎన్ ఎస్ విక్రమాదిత్యలో ఆమె ప్రయాణించి నావికాదళ కార్యకలాపాలను పర్యవేక్షించారు. తాజాగా - నిర్మలా సీతారామ‌న్ మ‌రో అరుదైన ఘ‌న‌త ద‌క్కించుకున్నారు. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా చ‌రిత్ర సృష్టించారు. భారత మాజీ రాష్ట్ర‌ప‌తులు అబ్దుల్ కలామ్ - ప్ర‌తిభా పాటిల్ లు ఈ అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్న విషయం తెలిసిందే.

భార‌త వైమానిక ద‌ళంలో సుఖోయ్ ఫైట‌ర్ జెట్ కు ఉన్న ప్ర‌త్యేక‌త వేరు. 2 సీట్లు, 2 ఇంజ‌న్లు ఉన్న ఈ యుద్ధ విమానాన్ని స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ ఏ ఎల్ ) రూపొందించింది. అణ్వాయుధ సామర్థ్యం గల ఈ విమానం...శత్రు దేశ భూభాగంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించ‌గ‌ల‌దు. బుధ‌వారం నాడు....జోధ్‌పూర్ వైమానిక స్థావ‌రంలో ఉన్న ఫైటర్ జెట్ సుఖోయ్-30 ఎంకేఐలో నిర్మలా సీతారామన్ విహరించి త్రివిధ ద‌ళాల ఆప‌రేష‌న్స్ ను సమీక్షించారు. ప్ర‌త్యేక జీ సూట్ - ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ఉండే హెల్మెట్ ను ధ‌రించిన ఆమె 45 నిమిషాలపాటు ప్రయాణించి ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ పోరాట సామర్థ్యాన్ని సమీక్షించారు. సుఖోయ్ లో విహ‌రించ‌డం ఒక గొప్ప అనుభూతి, సంతృప్తినిచ్చింద‌ని - అందులో ప్ర‌యాణించాక చాలా విషయాలు తెలిశాయని అన్నారు. కఠోర శిక్షణ - అభ్యాసం చేసిన రక్షణ సిబ్బంది పరిస్థితులకు అనుగుణంగా ఏవిధంగా సన్నద్ధమ‌వుతారో - ప్రతిస్పందిస్తారో తెలుసుకున్నానని చెప్పారు. సుఖోయ్ లో విహారం చాలా విజ్ఞానదాయకమైన, గుర్తుంచుకోదగిన ద‌న్నారు. సుఖోయ్ లో విహ‌రించిన నిర్మలా సీతారామ‌న్ పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మ‌హిళ అయి ఉండి స‌మ‌ర్థ‌వంతంగా ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డ‌మేకాకుండా, ధైర్యంగా గ్రౌండ్ లెవ‌ల్ లో ప‌ర్య‌టించి వారి సాధ‌క‌బాధ‌కాల‌ను, కార్య‌క‌లాపాల‌ను తెలుసుకుంటోన్న సీతారామ‌న్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.