Begin typing your search above and press return to search.

రికార్డ్‌: సియాచిన్‌ లో నిర్మ‌ల ద‌స‌రా వేడుక‌లు

By:  Tupaki Desk   |   1 Oct 2017 6:17 AM GMT
రికార్డ్‌: సియాచిన్‌ లో నిర్మ‌ల ద‌స‌రా వేడుక‌లు
X
ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన - అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతంగా రికార్డుల‌కు ఎక్కింది సియాచిన్ ప్రాంతం. చైనా - భార‌త్‌ - పాక్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉన్న ప్రాంతంలో మ‌న స‌రిహ‌ద్దే ఎక్కువ‌. దీంతో ఎంతో ఖ‌ర్చు క‌నిపిస్తున్నా.. అక్క‌డ భార‌త ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసింది. అలాంటి ఎత్త‌యిన ప్రాంతంలో విధులు నిర్వ‌హించ‌డం అత్యంత క‌ష్ట‌మ‌ని ఆర్మీ ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించింది. అంతేకాదు, అక్క‌డ‌కు వెళ్ల‌డం కూడా చాలా క‌ష్ట‌మ‌ని అధికారులు చెబుతారు. ఇక‌, ప్ర‌తి కూల ప‌రిస్థితుల్లో అక్క‌డ విధులు నిర్వ‌హించ‌డం అంటే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప‌నిచేయ‌డ‌మే!

అలాంటి అత్యంత ఎత్త‌యిన ప్రాంతానికి ర‌క్ష‌ణ మంత్రులు వెళ్ల‌డం అరుదు. మ‌నోహ‌ర్ ప‌ర్రీక‌ర్ ర‌క్ష‌ణ మంత్రిగా ఉన్న స‌య‌మంలోనే రెండు సార్లు ప్ర‌య‌త్నించి ఒక్క‌సారి మాత్ర‌మే వెళ్ల‌గ‌లిగారు. అంత‌టి ప్ర‌మాద‌క‌ర ప్రాంతానికి తాజాగా ర‌క్ష‌ణ శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ నిర్మాలా సీతారామ‌న్ వెళ్లి రికార్డు సృష్టించారు. వాస్త‌వానికి అతి పెద్ద దేశం భార‌త్‌కు ర‌క్ష‌ణ మంత్రిగా ఓ మ‌హిళ ఉండ‌డం నిర్మ‌ల సృష్టించిన తొలిరికార్డు అయితే, తాజాగా ఆమె అత్యంత ప్ర‌మాద‌క‌ర‌, అత్యంత ఎత్త‌యిన సియాచిన్‌కు వెళ్ల‌డం మ‌రో రికార్డు. అంతేకాదు, అక్క‌డ విధుల్లో ఉన్న సైనికుల‌తో క‌ల‌సి ఆమె ద‌స‌రా వేడుక‌లు నిర్వ‌హించారు.

వారికి స్వీట్లు పంచారు. శుభాకాంక్ష‌లు చెప్పారు. సైనికుల‌ను ఆప్యాయంగా పేరుపేరునా ప‌ల‌క‌రించారు. జమ్మూకశ్మీర్‌లో రెండోరోజుల‌ పర్యటనలో భాగంగా నిర్మ‌ల‌ దేశ రక్షణపరంగా కీలక వ్యూహాత్మక ప్రాంతాలైన‌ లేహ్‌ - లడఖ్‌ - సియాచిన్‌ ప్రాంతాలను సందర్శించారు. సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ లో అమరవీరులకు నిర్మలా సీతారామన్‌ నివాళులు అర్పించారు. అనంతరం లేహ్‌లో బ్రిడ్జిను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్‌...సైనికులకు దసరా శుభాకాంక్షలు తెలిపినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.