Begin typing your search above and press return to search.

చైనాపై యుద్ధం ప్రకటించిన డిఫెన్స్ కాలనీ

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:30 AM GMT
చైనాపై యుద్ధం ప్రకటించిన డిఫెన్స్ కాలనీ
X
సరిహద్దుల్లో 20 మంది మరణానికి కారణమైన చైనాపై దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనా వస్తువులు, యాప్ లు వాడవద్దంటూ పెద్ద ఎత్తున భారత ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. చైనా వస్తువుల బహిష్కరణ పిలుపునిస్తున్నారు.

తాజాగా ఢిల్లీలోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిఫెన్స్ కాలనీ చైనాపై యుద్ధం ప్రకటించింది. ఆ దేశం తయారు చేసిన ఉత్పత్తులను రోడ్డుమీద వేసి కాల్చివేశారు. చైనా జెండాను, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు రిటైర్డ్ మేజర్ రంజిత్ సింగ్ ఓ ఆడియో రిలీజ్ చేశాడు. చైనా తయారు చేసిన వస్తువులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చాడు. భారత సైనికులను చంపడం ద్రోహం, హత్య తప్ప మరేమీ కాదన్నారు. ఇందుకు డిఫెన్స్ కాలనీ చైనా పై యుద్ధం ప్రకటిస్తుందని తెలిపారు.

రంజిత్ సింగ్ ఆడియో ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతోంది. యుద్ధం తుపాకులతో కాదని.. ఇతర మార్గాల ద్వారా యుద్ధం చేద్దామని రంజిత్ సింగ్ పిలుపునిచ్చాడు. ఆర్థికపరంగా చైనాను దెబ్బకొట్టగలమని.. అన్నీ చైనా వస్తువులను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేశారు.

ఇక ఉత్తరప్రదేశ్ లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. బీహార్ లోని పాట్నా, గుజరాత్ లోనూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. చైనా తయారు చేసిన టీవీలు, ఇతర వస్తువులను పగులగొట్టారు.