Begin typing your search above and press return to search.

ఢిల్లీ నివాస యోగ్యమేనా?..క్రికెటర్ల మాస్క్ లతో కొత్త చర్చ!

By:  Tupaki Desk   |   31 Oct 2019 4:40 PM GMT
ఢిల్లీ నివాస యోగ్యమేనా?..క్రికెటర్ల మాస్క్ లతో కొత్త చర్చ!
X
దేశ రాజధాని ఢిల్లీలో నివాస యోగ్యత పై ఇప్పుడు నిజంగానే కొత్త చర్చ మొదలైపోయింది. దేశ రాజధాని అంటే కాస్తంత రద్దీ ఎక్కువే అయినా... మరీ అక్కడ నివసించాలంటేనే భయాందోళన వ్యక్తమయ్యేలా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయంటే కాస్తంత ఆలోచించాల్సిందే కదా. హస్తినలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం హోదాలో అరవింద్ కేజ్రీవాల్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నా... మొన్న దీపావళి సందర్భంగా పేలిన టపాసుల ధాటికి ఢిల్లీలో మరోమారు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందనే చెప్పాలి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఓ చక్కటి ఉదాహరణ దొరికింది. అదేంటంటే... టీమిండియాతో సిరీస్ ఆడేందుకు ఢిల్లీ చేరిన బంగ్లాదేశ్ క్రికెటర్లు... ప్రాక్టీస్ సందర్భంగా ముఖానికి మాస్కులు వేసుకుని మరీ అరుణ్ జైట్లీ స్టేడియంలో కనిపించారు.

నవంబర్ 3వ తేదీన భారత్ - బంగ్లాదేశ్ మధ్య ఇక్కడి అరుణ్ జైట్లీ స్టేడియంలో టీ-20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ కు ఇప్పుడు కాలుష్యం అడ్డంకిగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఢిల్లీకి చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే గురువారం ఉదయం ప్రాక్టీస్‌ లో బంగ్లా ఆటగాడు లిటన్ దాస్ మాస్క్ ధరించి.. ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గతేడాది భారత్‌తో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌ లో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్ ధరించి ఆడారు. దీనిపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు లిటన్ దాస్ కూడా మాస్క్ ధరించడం సర్వత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తనకు ఆరోగ్య సమస్య ఉందని.. అందుకే మాస్క్ ధరించి ప్రాక్టీస్ చేశానని దాస్ తెలిపాడు.

అయితే కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ వేదికను మార్చాలని పలు డిమాండ్లు వచ్చాయి. కానీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ వేదికలో ఎటువంటి మార్పులు ఉండదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే మ్యాచ్ వేదికను మార్చే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రాక్టీస్ లోనే కాకుండా మెయిన్ మ్యాచ్ లోనూ క్రికెటర్లు ఇలానే ముఖానికి మాస్కులతో ఆడక తప్పదేమో మరి.