Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్ ట్వీట్:ఢిల్లీ పోలీసులు విఫలం..మీరే రంగంలోకి దిగండి

By:  Tupaki Desk   |   26 Feb 2020 7:35 AM GMT
కేజ్రీవాల్ ట్వీట్:ఢిల్లీ పోలీసులు విఫలం..మీరే రంగంలోకి దిగండి
X
దేశ రాజధానిలోని ఈశాన్య ఢిల్లీలో సోమవారం రాత్రి ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. శాంతియుతంగా కొనసాగుతున్న ఆందోళనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. పరస్పర దాడులు చేసుకుంటూ బీభత్సకర వాతావరణం ఏర్పడింది. ఈ దాడుల్లో ఒక్కరోజే 7 మంది చనిపోగా ఆ అల్లర్లు మంగళవారం కూడా కొనసాగాయి. మంగళవారం మరో 10 మంది మృతి చెందడం ఢిల్లీలో పరిస్థితులు అదుపు తప్పాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాకాండ చెలరేగడంతో ఢిల్లీ పోలీసులు నియంత్రించడంలో విఫలమయ్యారు. దీంతో వెంటనే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.

దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి బుధవారం స్పందిస్తూ తాము విఫలమయ్యామని, వెంటనే రంగంలోకి సైన్యం దిగాలని కోరాడు. తమ ఢిల్లీ పోలీసులు దారుణంగా విఫలం అయ్యారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సర్వశక్తులను ఒడ్డినప్పటికీ అక్కడ అల్లర్లు, దాడులు, ప్రతిదాడులను అడ్డుకోవడం, శాంతిభద్రతలను పునరుద్ధరించడంలో పోలీసులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సైన్యాన్ని దింపడం ఒక్కటే మార్గమని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జవాన్లను ఢిల్లీలో దింపాలని కోరారు. ఢిల్లీలో పోలీసు వ్యవస్థ ఆ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండదు. లెప్టినెంట్ గవర్నర్ ఆధీనంలో పోలీసు వ్యవస్థ పని చేస్తుంది. గవర్నర్ సూచనలు - ఆదేశాల మేరకే అక్కడి పోలీసులు విధులను నిర్వర్తిస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. సలహాలను మాత్రమే అందించగలుగుతుంది. ఈ మేరకు కేజ్రీవాల్ నిర్ణయాలకు తగ్గట్టు పోలీసులు వ్యవహరించకపోవడంతో ఆయన విమర్శలు చేశారు. వెంటనే కేంద్ర బలగాలు దింపాలని కోరాడు.

ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్‌పూర్, యమునా నగర్ వంటి ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శనలను చేస్తున్న ఆందోళనకారులు బీభత్సం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 20 మంది మరణించిన విషయం తెలిసిందే. పరస్పర దాడులతో పెద్ద సంఖ్యలో పలువురు గాయాలపాలవగా వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.